మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి'లో యాక్షన్ ఘట్టాలకు అత్యంత ప్రాధాన్యత ఉన్న సంగతి తెలిసిందే. ఈ యాక్షన్ ఘట్టాల కోసం సైరా టీమ్ సన్నధ్దమవుతోందట. ఔట్ డోర్స్‌లో భారీ యాక్షన్ ఘట్టాల కోసం ప్లాన్ చేస్తున్నారట.
సమ్మర్ తాపం ఎక్కువగా ఉండడంతో ఈ యాక్షన్ ఘట్టాల్ని తెరకెక్కించేందుకు ఇంతవరకూ కాస్త ఆలోచించారట చిత్ర యూనిట్. ఎండలు కాస్త చల్లబడగానే యాక్షన్ ఎపిసోడ్స్‌కి రంగం సిద్ధం చేయబోతున్నారనీ తెలుస్తోంది. మరోవైపు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నటించిన 'రంగస్థలం' సినిమాలోని కొన్ని సెట్స్‌ని ఈ సినిమా కోసం వాడుకోనున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సెట్‌లో చిన్నా చితకా మార్పులు చేసి 'సైరా' కోసం వినియోగించనున్నారట. ఈ యాక్షన్ ఘట్టాల కోసం ప్రత్యేకంగా హాలీవుడ్ కొరియోగ్రాఫర్స్‌ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
అంతేకాదు, యుద్ధ నేపథ్యంలో తెరకెక్కే యాక్షన్ ఎపిసోడ్స్ కాబట్టి, కాస్టింగ్ కూడా ఎక్కువే అవుతుంది. చాలా మంది విదేశీ ఫైటర్స్‌ని ఇందుకోసం వాడుతున్నట్లు తెలుస్తోంది. మొట్టమొదటి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. స్వాతంత్య్రం నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం కాబట్టి, ఈ సినిమా చిత్రీకరణ విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది.
ఎక్కడా రాజీపడకుండా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.