ఏపీలో జరుగుతున్న రగడ సినీ అభిమానులకు తెలియంది కాదు. రోజు రోజుకీ అక్కడ మూతపడుతున్న థియేటర్ల సంఖ్య ఎక్కువ అవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే - ఆంధ్రాలో సినిమా వ్యవస్థ కుప్పకూలుతుంది. పెద్ద సినిమాలు విడుదల అయ్యే ఛాన్సే ఉండదు. ఈ పరిస్థితిని కంట్రోల్ లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే చిరంజీవి రంగంలోకి దిగుతున్నారని, త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో... ఆయన భేటీ వేయనున్నారని ఈమధ్య వార్తలొచ్చాయి. మంత్రి పేర్ని నాని మధ్యవర్తిత్వం వహించి - చిరు, జగన్ ల మధ్య భేటీ సెట్ చేశారని, ఫిల్మ్ నగర్‌లో ఓవార్త చక్కర్లు కొట్టింది. అయితే... ఇప్పటి వరకూ ఎలాంటి అప్‌డేట్ రాలేదు.
చిరు - జగన్ ల మధ్య భేటీ జరుగుతుందని ఇప్పుడు కాదు, ఇది వరకూ వార్తలొచ్చాయి. అంతా సెట్ అయిన తరుణంలో ఆ మీటింగ్ కాన్సిల్ అయ్యింది. ఆ తరవాత నుంచి అసలు అలాంటి ప్రయత్నమేదీ జరగలేదు. సినిమా వాళ్లని కలవడానికి జగన్ ఏమాత్రం సముఖత చూపించడం లేదని, అందుకే.. అసలు టాలీవుడ్ కూడా దీనిపై ఆశలు పెట్టుకోలేదని తెలుస్తోంది. ఒక్కసారి జగన్ ని కలిసి, మాట్లాడితే పరిస్థితి చక్కబడుతుందన్న ఆశలూ ఉన్నాయి.
ఈ విషయంలో చిరు కాస్త చొరవ తీసుకుని, పేర్ని నానిని లైన్ లోకి తీసుకొచ్చారని, ఆయనే జగన్ అప్పాయింట్ మెంట్ తీసుకున్నారని, ఇదే చివరి ప్రయత్నం అని, ఇప్పుడు జగన్ కలవకపోతే... ఇంకెప్పుడూ ఇలాంటి భేటీలు ఉండవని తెలుస్తోంది. ఈ రెండు మూడు రోజుల్లో జగన్ ని చిరు కలవడం పక్కా అని... లేని పక్షంలో... ఆ ఆశలు కూడా గల్లంతైనట్టే అని టాక్ వినిపిస్తోంది.