ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి అవుదామనుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆశలు నెరవేరలేదు. అయితే, రాజ్యసభకు ఎంపికై ఆయన కేంద్ర మంత్రిగా కొంతకాలం పనిచేశారు. అలా చూస్తే, రాజకీయాల్లో చిరంజీవి ఉన్నత పదవుల్నే అలంకరించారని నిస్సందేహంగా చెప్పొచ్చు.
అయినాగానీ, చిరంజీవికి వున్న స్టార్‌డమ్‌ని పరిగణనలోకి తీసుకుంటే, అది ఆయనకు పెద్ద పదవి ఏమీ కాదు. పార్టీ పెట్టకుండా కూడా చిరంజీవి కేంద్ర మంత్రి పదవి తెచ్చుకుని ఉండేవారు. అప్పట్లో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం కోసం పవన్ కళ్యాణ్ పనిచేసిన సంగతి తెల్సిందే. మరిప్పుడు తమ్ముడి కోసం అన్నయ్య మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా? అనే చర్చ జరుగుతోంది. ఇటీవలి కాలంలో మెగా కాంపౌండ్‌లో విభేదాల కొంత చల్లారాయి. అభిమానులూ ఓ అండర్‌స్టాండింగ్‌కి వస్తున్నారట. ఆ దిశగా నాగబాబు ప్రయత్నాలు వర్కవుట్ అయినట్లే కన్పిస్తోంది.
త్వరలోనే చిరంజీవి, పవన్‌కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరతారని సమాచారమ్. బాబాయ్ పిలిస్తే ప్రచారానికి తాను సిద్ధమని రామ్‌చరణ్ చెప్పాడు. మావయ్య కోసం ఏం చేయడానికైనా వెనుకాడనని మెగా మేనల్లుడు సాయిధరమ్ ప్రకటించేశాడు. ఇక స్పందించాల్సింది చిరంజీవి మాత్రమే.
అతి త్వరలోనే చిరంజీవి నుంచి ఆ తీపి కబురు అందబోతోందనీ, పవన్‌కళ్యాణ్‌ని ముఖ్యమంత్రిని చేసే బాధ్యతను చిరంజీవి తీసుకోబోతున్నారని తెలియవస్తోంది. మారిన రాజకీయ సమీకరణాలు పవన్‌కళ్యాణ్‌కి అనుకూలంగా మారతాయని చిరంజీవి కూడా ఓ అంచనాకి వచ్చారట.