బాక్సాఫీసు రికార్డులు సృష్టించడంలో మగధీరుడు చిరు. అసలు ఇండ్రస్ట్రీ హిట్ అనే మాట చిరంజీవి సినిమాలతోనే ప్రారంభమైంది. రికార్డు వసూళ్లు సాధించి టాలీవుడ్ స్టామినా ఎలాంటిదో చాటి చెప్పిన ఘనత అచ్చంగా మెగాస్టార్‌దే. మరి మెగాస్టార్ టాప్ టెన్ సూపర్ హిట్స్‌ని ఒక్కసారి పరిశీలిస్తే..
1. ఖైదీ (1983) చిరంజీవికి స్టార్ డమ్ తీసుకొచ్చిన సినిమా ఖైదీ. చిరు కెరీర్ ఖైదీకి ముందు... ఆ తరవాత.. అని విభిజించి చూస్తారంటే, ఈ సినిమాకున్న ప్రాధాన్యం ఏమిటో అర్థమవుతోంది. ఖైదీ తరవాత చిరు రేంజ్ అమాంతం పెరిగింది. యాక్షన్ సీన్స్‌ని రూపొందించడంలో హాలీవుడ్ స్టైల్ పోరాటాల్ని తెలుగు సినిమాల్లోకి దిగుమతి చేయడంలో ఖైదీ తన ప్రత్యేకత చూపించుకొంది. యాంగ్రీ యంగ్ మెన్ లుక్‌లో చిరుని చూసి అభిమానులు ఫిదా అయ్యారు. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన చిత్రమిది. రగులుతోంది మొదలిపొగ పాట సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో చిరు - పరుచూరి బ్రదర్స్‌ల హిట్ కాంబోకి బీజం పడింది.
2. పసివాడి ప్రాణం (1987) ఇదీ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమానే. ఖైదీ చిరుకి క్రేజ్ తీసుకొస్తే... ఈ సినిమా తిరుగులేని హీరోని చేసింది. పసివాడి ప్రాణంలో చిరు నటన, కథ కథనాలు, పసివాడి పాత్ర చిత్రణ ఓ హైలెట్ అయితే... మంచు కొండల్లో చిరు వేసిన స్టెప్పులు మరో ప్రధాన హైలెట్. అసలు అలాంటి స్టెప్పుల్ని తెలుగు ప్రేక్షకులు చూడడం అదే మొదటిసారి. కేవలం డాన్సుల కోసమే ఆ సినిమాని మళ్లీ మళ్లీ చూశారంటే అతిశయోక్తి కాదు.
3. స్వయం కృషి (1987) విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. పాటలన్నీ సూపర్ హిట్టే. చిరు తన ఇమేజ్‌కి భిన్నంగా ఇలాంటి కథ ఎంచుకోవడం అప్పట్లో ఆశ్చర్యపరిచింది. ఓ స్టార్ హీరో... చెప్పులు కుట్టుకొనే సాధారమైన పాత్రలో నటించడం సాహసమే. పైగా చిరు తరహా డాన్సులుగానీ, ఫైటింగులు గానీ లేని కథ ఇది. అయినా సరే.. ప్రేక్షకుల్లో నిలిచిపోయింది. చిరుకి తొలిసారి నంది అవార్డు తీసుకొచ్చిన సినిమా ఇదే.
4. కొండవీటి దొంగ (1990) చిరంజీవి - కోదండరామిరెడ్డి కాంబినేషన్లో వచ్చిన మరో సూపర్ హిట్ సినిమా ఇది. రాబిన్ హుడ్ తరహా కథ ఇది. ఓ దొంగ డబ్బున్న వాళ్ల దగ్గర కొట్టేసి, పేదోళ్లకు పంచడం అన్నది కాన్సెప్ట్. దాన్నికమర్షియల్‌గా తీర్చిదిద్దడంలో విజయం సాధించాడు దర్శకుడు. విజయశాంతి, రాధలతో చిరు పాడిన డ్యూయెట్లు ఈ సినిమాని మ్యూజికల్ హిట్‌గా తీర్చిదిద్దాయి. అప్పటి వరకూ చిరు సినిమాలు సాధించిన రికార్డులన్నీ ఈ సినిమా బ్రేక్ చేసింది.
5. జగదేక వీరుడు అతిలోక సుందరి (1990) సోషియో ఫాంటసీ సినిమాల్లో ఇదో క్లాసిక్. జగదేకవీరుడిగా చిరు విన్యాసాలు, అతిలోక సుందరిగా శ్రీదేవి అందాలు... ఇప్పటికీ కళ్ల ముందు కదులుతూనే ఉంటాయి. అమ్రిష్ పురి విలనిజం ఈ సినిమాకి మరో హైలెట్. ఇళయరాజా మరోసారి తన పాటలతో విజృంభించారు. అబ్బనీ తీయని దెబ్బ.. పాట, అందులో చిరు వేసిన క్లాసీ స్టెప్పులు ఇప్పటికీ ఓ పాఠం. వరదల ఉధృతిలో విడుదలైన సినిమా ఇది. మొదటి రోజు థియేటర్లో జనమే లేరు. కానీ రెండో రోజు నుంచీ థియేటర్ల ముందు జాతర మొదలై.. సరికొత్త రికార్డులు సృష్టించింది.
6. గ్యాంగ్ లీడర్ (1991) చిరుని కుటుంబ ప్రేక్షకులకు మరింత దగ్గర చేసిన మాస్ సినిమా ఇది. అప్పట్లో ఇండ్రస్ట్రీ హిట్. చిరంజీవి నటన, డాన్సులు మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరీ ముఖ్యంగా చిరు వేసిన పూల చొక్కాలు అప్పట్లో ఓ డ్రెండ్‌ని సృష్టించాయి. గ్యాంగ్ లీడర్ చొక్కాలంటూ.. అమ్మకానికి పెట్టారు. మిగిలిన భాషల్లోనూ రీమేక్ అయిన ఈ సినిమా అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకొంది.
7. ఘరానా మొగుడు (1992) చిరంజీవి - కె.రాఘవేంద్రరావు ల కాంబినేషన్ అందించిన మరో సూపర్ హిట్ సినిమా ఇది. పాటలు ఆల్ టైమ్ హిట్‌గా నిలిచాయి. ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్లు, పండు పండు పండు.. పాటలు ఇప్పటికీ వినిపిస్తాయి. టాలీవుడ్‌లో రూ.10 కోట్లు సాధించిన తొలి చిత్రం ఇదే. ఆ వసూళ్ల పరంపర చూసి మిగిలిన భాషా చిత్రాలు అసూయ పడ్డాయి.
8. చూడాలని ఉంది (1998) గుణశేఖర్ - చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది. ఎక్కువ కేంద్రాల్లో వంద రోజులు ఆడిన సినిమాగా అప్పట్లో రికార్డు సృష్టించింది. దాదాపు రూ.20 కోట్ల వసూళ్లతో టాలీవుడ్ రికార్డులన్నీ బ్రేక్ చేసింది.
9. ఇంద్ర (2002) టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టించిన సినిమా ఇది. బి.గోపాల్ - చిరు కాంబినేషన్ చరిత్రే సృష్టించింది. వసూళ్ల పరంగా, ఎక్కువ కేంద్రాల్లో వంద ఆడిన సినిమాగా రికార్డులు బ్రేక్ చేసింది. చిరు ఫ్యాక్షనిస్టుగా కనిపించిన తొలి సినిమా ఇదే. దాయి దాయి దామ్మా పాటలో చిరు వేసిన వీణ స్టెప్.... ఓ చరిత్రగా మిగిలిపోయింది. డాన్సుల్లో కొత్త ట్రెండుకు శ్రీకారం చుట్టింది.
10. ఖైది నెం.150 (2017) తొమ్మిదేళ్ల తరవాత చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా ఇది. చిరు సినిమాలకు పనికొస్తాడా? చిరు క్రేజ్ అలానే ఉందా? చిరు సినిమా తీస్తే అభిమానులు మళ్లీ చూస్తారా? అనే అనేక ప్రశ్నల్ని ఈ సినిమా పటాపంచలు చేసింది. చిరు డాన్సుల్లోనూ గ్రేస్ తగ్గలేదని ఈ సినిమా నిరూపించింది. నాన్ బాహుబలి రికార్డులన్నీ ఈ సినిమా బ్రేక్ చేసింది. సైరా సినిమాపై దాదాపు 250 కోట్లు పెట్టడానికి రెడీ అయ్యారంటే.. ఖైది నెం.150 ఇచ్చిన స్ఫూర్తి, నమ్మకమే కారణం. చిరు అభిమానుల్లో మళ్లీ కొత్త ఉత్సాహం నింపిన సినిమా ఇది.