కోటి ఆశలతో సినీ ఇండస్ట్రీకి వచ్చే వారందరికీ చిరంజీవే ఆదర్శం. ఆ మాటకొస్తే, సినీ పరిశ్రమలోకే కాదు, ఏ రంగంలో అభివృద్ధి సాధించాలన్నా చిరంజీవి జీవితం ఆదర్శప్రాయమైంది. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా, ఓ సామాన్యుడు అతీతమైన శక్తిగా ఎదగడానికి చేసే కృషి, పట్టుదల చిరంజీవి నుండే అలవర్చుకోవాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న తత్వానికి నిలువెత్తు నిదర్శనం చిరంజీవి.
అందుకే ఆయన అభిమానినయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను.. అంతకు మించి ఆయన తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం.. అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అన్నయ్యపై తనకున్న అపారమైన భక్తి, అభిమానం, గౌరవాన్ని చాటుకున్నారు. ఇటీవల ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో జరిగిన అవకతవకల కారణంగా ఎందరో విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆలాంటి సిట్యువేషనే తాను ఎదుర్కొన్నాననీ, తనకు చిరంజీవి అన్నయ్య కావడం వల్ల, ఆ రోజు తాను ఆత్మహత్య చేసుకోకుండా కాపాడగలిగాడనీ పవన్ కళ్యాణ్ తాను ఇంటర్మీడియట్ పరీక్షలు తప్పిన నాటి పరిస్థితుల్ని నెమరు వేసుకున్నారు.
ప్రతీ ఇంట్లోనూ చిరంజీవి లాంటి అన్నయ్య ఉంటే, ఆ విద్యార్ధులు బలవన్మరణాలకు పాల్పడి ఉండేవారు కాదని చాలా బాధపడ్డానని పవన్ కళ్యాణ్ చెప్పారు. అలా తన జీవితానికి స్పూర్తి ప్రధాత చిరంజీవి. మూడు సార్లు దారి తప్పిన నన్ను సన్మార్గంలోకి తెచ్చిన గురువు మా అన్నయ్య చిరంజీవి.. అని ఈ పుట్టినరోజు చాలా స్పెషల్, ఈ సంవత్సరం అంతకన్నా స్పెషల్ అని ఆయన ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్పూర్తిగా ఆకాంక్షించారు పవన్ కళ్యాణ్.