నిన్న చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయనకు అరవై ఏడేళ్లొచ్చాయి. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో చిరు అందుకోని మైలు రాయి లేదు. సాధించని రికార్డు లేదు. ఓ తరానికి చిరు స్ఫూర్తి. సామాన్యుడి నుంచి సూపర్ స్టార్ గా మారడం వెనుక అనితర సాధ్యమైన ప్రయాణం దాగుంది. చిరులాంటి మెగాస్టార్ మరోడు లేడు....పుట్టడు కూడా.
అయితే ఈ వయసులోనూ... చిరు ముందు కొత్త లక్ష్యాలూ, గమ్యాలు కనిపిస్తున్నాయి. తనని తాను మళ్లీ నిరూపించుకోవడానికి కొత్త దారుల్ని సృష్టించుకోవడానికీ కొత్త అవకాశాలు సృష్టించుకోవాల్సిన అవసరం ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తోంది. దానికి `ఆచార్య` ఫలితం ఓ మేలుకొలుపు. చిరు మాస్ హీరో. ఆ మాటకొస్తే.. మాస్ కా బాప్. కమర్షియల్ హీరోయిజానికి చిరు పెట్టింది పేరు. ఇప్పటికీ మిగిలిన మాస్ హీరోలు ఆయన నడిచొచ్చిన దారినే అనుసరిస్తున్నారు. కానీ ఇప్పుడు చిరు ఆ దారి వదిలి.... కొత్త మార్గాన్ని అన్వేషించుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.
దానికి రెండు కారణాలు. ఒకటి... చిరు వయసు మీరడం. మరోటి.. ప్రేక్షకుల ఆలోచనా ధోరణి మారడం. అరవై దాటాక ఇప్పటికీ డ్యూయెట్లు పాడతానంటే, సిగ్నేచర్ స్టెప్పులు వేస్తానంటే కుదరదు. వయసుని గుర్తెరిగి పాత్రల్ని ఎంచుకోవాల్సిందే. పైగా ఓటీటీల ప్రభావం విపరీతంగా పడిపోయింది. రెగ్యులర్ సినిమాల్నీ, కథల్నీ ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నారు. ఇన్నాళ్లూ ఇదే ఫార్ములానే ఆధారపడి తిరుగులేని విజయాల్ని అందుకొన్న హీరోలు... వాటిని వదిలించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. చిరు కూడా అందుకు మినహాయింపు కాదు. ఇప్పుడు కూడా.. మాస్ హీరో, కమర్షియల్ ఫార్ములాని నమ్ముకుంటానంటే కుదరని విషయం. వయసు పైపడిన తరవాత.... అమితాబ్ బచ్చన్, మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి స్టార్లు ఏం చేశారో... చిరులాంటి అగ్ర కథానాయకులు గుర్తుపెట్టుకోవడం మంచిది. పాటలూ, ఫైట్లూ అనే ఫార్ములా వదిలి కొత్త తరహా పాత్రలు ఎంచుకోవాలి. కేవలం కథని నమ్మి సినమాలు చేయాలి. కొత్త ఇమేజ్‌ని సృష్టించుకోవాలి.చిరు ఏ రకమైన పాత్ర చేసినా స్వీకరించడానికి సిద్ధంగా ఉండేలా ఈ తరాన్ని ... తయారు చేసుకోవాలి. ఇది చిరుకి మాత్రమే కాదు. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి వాళ్లకు సైతం వర్తించే సూత్రం. కానీ వీళ్లలో ఇప్పటికీ చిరుకే ఫాలోయింగ్ ఎక్కువ. రికార్డులు సృష్టించి, తెలుగు చిత్రసీమలో కొత్త చరిత్రని లిఖించే స్టామినా ఇప్పటికీ చిరుకి ఉంది. అందుకే చిరు కాస్త మారితే - కొత్త తరహా కథలకు, కొత్త తరహా సినిమాలకు ఓ దారి చూపించిన వాడవుతాడు.
నాలుగు దశాబ్దాలుగా ఓ ఇమేజ్‌కి, ఓ ఫార్ములాకి అలవాటు పడిన చిరులాంటివాళ్లు సడన్ గా రూటు మార్చడం కష్టం కావొచ్చు. కాకపోతే అసాధ్యం ఏం కాదు. చిరు పిచ్చ పీక్స్‌లో ఉన్నప్పుడే.. రుద్రవీణ, ఆపద్భాంధవుడు, స్వయంకృషి లాంటి సినిమాలు చేసినవాడు. ఇమేజ్ ఛట్రాన్ని బద్దలు కొట్టడానికి తన వంతు ప్రయత్నం చేసినవాడు. ఇప్పుడు మారుతున్న సమీకరణాలకు అనుగుణంగా తనని తాను సిద్ధం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. కాకపోతే.. ఓ అడుగు పడాలంతే. ఆ అడుగు ఈ యేడాదిలో పడుతుందేమో చూడాలి. అదే జరిగితే.... వచ్చే దశాబ్దంలో కొత్త చిరంజీవిని చూసే అవకాశం అదృష్టం... దక్కుతుంది.