మెగా అభిమానుల ఉత్కంఠకు తెర పడబోతోంది. మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ప్రారంభోత్సవానికి రంగం సిద్ధం అవుతోంది. ఆగష్టు నెల్లోనే సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. నిజానికి ఆగష్టు వస్తోందంటే అభిమానులకు పెద్ద పండగే. ఈ నెలంతా మెగా అభిమానులు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు పండగని ఓ పరంపరగా నిర్వహిస్తారు. నాలుగు రోజులు, వారం రోజులు, 10 రోజులు ఇలా వరుసగా తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను నెలంతా ఉత్సవంలా జరుపుకుంటారు. అందులో భాగంగానే ఇదే నెలలో చిరంజీవి 151వ సినిమా 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'కి ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే ఆ సినిమాని చిరంజీవి పుట్టినరోజు ఆగష్టు 2న స్టార్ట్ చేయాలా? లేక స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న స్టార్ట్ చేయాలా అని చిత్ర యూనిట్ యోచిస్తోందట. స్వాతంత్య్ర సమరయోధుని జీవిత గాధ కాబట్టి ఈ సినిమాను ఆగష్టు 15న స్టార్ట్ చేస్తే బావుంటుందనే యోచనలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఏ తేదీని ఫిక్స్ చేయాలా అని ఈ చిత్ర నిర్మాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్లగుల్లాలు పడుతున్నాడట. ఈ సినిమాకి 'మహావీర' అనే టైటిల్‌ని అనుకుంటున్నారు. యూనివర్సల్‌గా ఈ సినిమాని పలు భాషల్లో విడుదల చేయాలని అనుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగా ఈ టైటిల్‌ని అనుకుంటున్నట్లు సమాచారమ్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సినిమా కోసం చిరంజీవి పూర్తిగా మేకోవర్ అయ్యారు. మొత్తానికి ఈ నెల మెగా అభిమానులకు మహోత్సవమే అని చెప్పాలి.