మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి 'లూసిఫర్' రీమేక్ లో నటిస్తారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం మొదట సుజిత్ కు లభించింది. అయితే సుజిత్ రెడీ చేసిన తెలుగు వెర్షన్ స్క్రిప్ట్ చిరంజీవిని పెద్దగా మెప్పించలేకపోవడంతో ఆ అవకాశం ఇప్పుడు వినాయక్ కు లభించిందని అంటున్నారు.
వినాయక్ గతంలో చిరంజీవితో 'ఠాగూర్' 'ఖైదీ నెం.150' చిత్రాలను రూపొందించారు. రెండు సినిమాలూ రీమేకులే. ఆ సినిమాలు రెండూ బాక్సాఫీసు దగ్గర ఘనవిజయం సాధించాయి. అయితే వినాయక్ ఈమధ్య తన ఫామ్ కోల్పోయారు. 'ఖైదీ నెం.150' కాకుండా మిగతా సినిమాలన్నీ ఫెయిల్యూర్ గా నిలిచాయి. దీంతో ఈ సినిమాను ఎలాగైనా విజయవంతం చేయాలని కెరీర్లో తిరిగి పుంజుకోవాలని భావిస్తున్నారట. ప్రస్తుతం తన రైటింగ్ టీమ్ తో కలిసి 'లూసిఫర్' స్క్రిప్ట్ ను మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు మారుస్తున్నారట. చిరంజీవి ఇమేజికి తగ్గట్టుగా స్క్రిప్టులో మార్పులు చేర్పులు జరుగుతున్నాయని అంటున్నారు.
స్క్రిప్టు మొత్తం పూర్తయిన తర్వాత చిరంజీవికి నరేషన్ ఇస్తారని, ఆయన దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ప్రాజెక్ట్ ఫైనలైజ్ అవుతుందని సమాచారం. ఈ సినిమాను రామ్ చరణ్, ఎన్ వి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తారట.