'ఖైదీ నెంబర్ 150'తో రీ ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటి, దటీజ్ మెగాస్టార్ అనిపించుకున్న చిరంజీవి రీ ఎంట్రీలో తదుపరి చిత్రం కోసం 'సైరా నరసింహారెడ్డి' అంటూ రియలిస్టిక్ హిస్టారికల్ కథాంశాన్ని ఎంచుకుని, మరోసారి సక్సెస్ అయ్యారు. ఇక రీ ఎంట్రీలో ముచ్చటగా మూడో సినిమాని తెరకెక్కించే బాధ్యతలు కొరటాల శివకు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని త్వరలో లాంఛనంగా ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు.
డిశంబర్ 26న అందుకు మంచి ముహూర్తంగా భావించారు. చిరంజీవి ఫామ్ హౌస్‌లో పూజా కార్యక్రమాలతో ఈ సినిమాని ప్రారంభించనున్నారట. పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు భారీ ఎత్తున హాజరు కానున్నారని తెలుస్తోంది. తొలి షెడ్యూల్ షూటింగ్ డీటెయిల్స్ విషయానికి వస్తే, హైద్రాబాద్ పరిసరాల్లోని కొన్ని అందమైన లొకేషన్లు తొలి షెడ్యూల్ షూటింగ్ కోసం సిద్ధం చేశారట. రెండో షెడ్యూల్‌ని కోనసీమ పరిసర ప్రాంతాల్లో నిర్వహించనున్నారనీ తెలుస్తోంది.
పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో కథా, కథనాలుండబోతున్నాయనీ తెలుస్తోంది. హీరోయిన్ ఇంకా ఎవరూ ఫిక్స్ కాలేదు కానీ, త్వరలోనే హీరోయిన్ పేరును ప్రకటించనున్నారట. ఈ సినిమాలో చిరంజీవి డబుల్ రోల్ పోషించనున్నారని టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి.