సినిమాలు వేరు - రాజకీయాలు వేరు. సినిమా నటుల్ని చూడ్డానికి జనాలు వస్తారేమో. ఓట్లు వేయడానికి కాదు. ఈ విషయం చాలాసార్లు రుజువు అయ్యింది. తెలుగునాట తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న చిరంజీవి రాజకీయాల్లో విఫలం అయ్యాడు. పవన్ కల్యాణ్‌దీ అదే పరిస్థితి. చిరుతో పోలిస్తే పవన్ ఓటమి మరింత దారుణం. అందుకే చిరంజీవి సినిమా స్టార్లని రాజకీయాల్లోకి రావొద్దని హితవు పలికాడు.
రజనీకాంత్ త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్న తరుణంలో రజనీకాంత్‌కి చిరంజీవి విలువైన సలహానే ఇచ్చాడు. రాజకీయాలన్నీ డబ్బు మయం అయిపోయాయని, ఏదో మంచి చేద్దామని నిజాయతీగా వచ్చినవాళ్లకు సరైన ఆదరణ ఉండడం లేదని, తన రాజకీయ ప్రస్థానమే అందుకు నిదర్శనమని ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు చిరు. అంతేకాదు.. ఇటీవల రాజకీయాల్లోకి చేరి విఫలమైన కమల్‌హాసన్ ప్రస్థానాన్నీ గుర్తు చేశాడు. మరి.. ఈ సలహా రజనీకాంత్ స్వీకరిస్తాడా, లేదా? అనేది చూడాలి.