ఇలాంటి వ్య‌క్తులు వెదికినా దొర‌క‌రు: చిరు ప్ర‌సంశ‌

మరిన్ని వార్తలు

ఆర్‌.నారాయ‌ణ మూర్తి వ్య‌క్తిత్వం చాలా ప్ర‌త్యేకం. తెల్ల చొక్కా, తెల్ల ఫ్యాంటుతో ఎంత స్వ‌చ్ఛంగా క‌నిపిస్తారో, ఆయ‌న మ‌న‌సు కూడా అంతే స్వ‌చ్ఛంగా ఉంటుంది. ముఫ్ఫై సినిమాలు తీసినా ఆయ‌న‌కు సొంత కారు లేదు. ఎక్క‌డికి వెళ్లినా న‌డుచుకుంటూ వెళ్లిపోతుంటారు. షేర్ ఆటోల్లో ప్ర‌యాణం చేస్తుంటారు. సినిమాల కోసం పిచ్చి వ్యామోహంతో పెళ్లికి కూడా దూర‌మ‌య్యారు. అందుకే నారాయ‌ణ మూర్తి అంటే అంద‌రికీ ఇష్ట‌మే. చిరు కూడా ఈ రెడ్ స్టార్‌పై త‌న‌కున్న అభిమానాన్ని చాటుకున్నారు.

 

`మార్కెట్లో ప్రజాస్వామ్యం` ఆడియో ఫంక్ష‌న్‌కి చిరు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా నారాయ‌ణ మూర్తితో త‌న‌కున్న అనుబంధాన్ని మాట‌ల్లో ఇలా చెప్పుకొచ్చారు. ‘‘నారాయణమూర్తితో అనుబంధం నాలుగు దశాబ్దాల క్రితమే మొదలైంది. ‘ప్రాణం ఖరీదు’లో చిన్న కుర్రాడి పాత్ర పోషించాడు. చాలా హుషారుగా ఉండేవాడు. బాగా చ‌దువ‌కుని వ‌చ్చాడు. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ మా స్నేహం కొనసాగుతోంది. నారాయణ మూర్తి మనస్తత్వం నాకిష్టం. అంకితభావంతో సినిమాలు తీస్తుంటాడు. సినిమా అంటే చాలా ఇష్టం. కష్టాన్ని నమ్ముకున్నాడు. అలుపెరగక పోరాడుతూ, వచ్చిన అవకాశాల్ని సద్వినియోగ పరచుకుంటూ పీపుల్స్‌ స్టార్‌గా ఎదిగాడు. ఈ రంగంలోకి వచ్చిన ఎవరైనా సరే కమర్షియలైజ్డ్‌ అవుతుంటారు. కానీ కమ్యూనిజం నేపథ్యం నుంచి వచ్చిన నారాయణమూర్తి అలా అవ్వలేదు.

 

‘టెంపర్‌’ సినిమాలో పూరి తన కోసం ఓ పాత్ర సృష్టిస్తే.. ‘చేయలేను’ అంటూ ఆ సినిమాని వదులుకున్నాడు. రెండు సినిమాలు హిట్టయితే కారు కొనుక్కోవాలనో, ఇల్లు కొనుక్కోవాలనో అనిపిస్తుంది. కానీ నారాయణమూర్తి మాత్రం వాటికి దూరం. సినిమానే ప్రేమించాడు. సినిమానే పెళ్లి చేసుకున్నాడు. సినిమాతో సంసారం చేస్తున్నాడు. యోగిలాంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తులు వెతికినా దొరకరు. సమకాలీన రాజకీయ పరిస్థితిని ఈ సినిమాతో తెరపై చూపించాడనుకుంటున్నా. తనకు మంచి విజయాన్ని అందించాల’’న్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS