మన సినిమాల్లో ఫైట్లన్నీ చిత్ర విచిత్రంగా ఉంటుంటాయి. కొట్టుకునేది భూమ్మీదే అయినా.. రౌడీలు, విలన్లు.. గాల్లో తేలిపోతుంటారు. విలన్ ఎంత బలవంతుడైనా, హీరో ఎంత బక్కోడైనా.. ఎడం చేత్తో మట్టికరిపించేస్తుంటాడు. అయితే.. ఇలాంటి అసహజమైన పోరాట ఘట్టాలకు కాలం చెల్లిపోయింది. ఫైటింగులూ కొత్తగా ఉండేలా డిజైన్ చేస్తున్నారు దర్శకులు. అందులో భాగంగా కొత్త తరహా పోరాట ఘట్టాలు రెడీ అవుతున్నాయి.
చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం 'సైరా'లో నీటి అడుగున ఓ ఫైట్ తెరకెక్కిస్తున్నార్ట. నరసింహారెడ్డి ఓ స్వాతంత్య్ర పోరాట యోధుడు. బ్రిటీష్ వారిపై దాడి చేసి తప్పించుకునే క్రమంలో నీటిలో ఓ పోరాట ఘట్టాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డి డిజైన్ చేశాడట. ఇది అతి త్వరలో ముంబైలో తెరకెక్కిస్తారని సమాచారం. `సైరా`లో ఉన్నవన్నీ కత్తియుద్దాలే. వాటి మధ్య కొత్తగా ఉండాలనే.... ఈ అండర్ వాటర్ ఫైట్.
మరోవైపు కల్యాణ్ రామ్ కూడా నీటిలోనే ఫైట్ చేస్తున్నాడు. కల్యాణ్ రామ్ కొత్త చిత్రం '118' కోసం ఈ పోరాట ఘట్టాన్ని డిజైన్ చేస్తున్నారు. గుహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది. విశాఖ సముద్ర తీరంలో ఈ ఫైట్ తెరకెక్కిస్తారు. ఈ పోరాట ఘట్టం కోసం కల్యాణ్ రామ్ ప్రత్యేక ట్రైనింగ్ తీసుకున్నాడట. మరి.. ఈ రెండు ఫైట్లూ ఎలా వచ్చాయో తెలియాలంటే ఇంకొంతకాలం ఆగాలి.