జనసేన అన్నాడు.. ఆ తరవాత టీడీపీ అన్నాడు.. ఇప్పుడు వైకాపాలోకి చేరడానికి సిద్ధమైపోతున్నాడు అలీ. అవును.. ఎన్నికల నగారా మోగిన ఈ సమయంలో అలీ కీలక నిర్ణయం తీసుకోవాల్సివచ్చింది. చివరి క్షణంలో వైకాపా పార్టీలో చేరిపోయాడు అలీ. మొన్నటి వరకూ అలీ టీడీపీలో చేరడం ఖాయమని, అలీకి గుంటూరు (తూర్పు) టికెట్లు దక్కబోతోందని చెప్పుకున్నారు. అలీ కూడా ఈ మాటల్ని ఖండించలేదు. విజయవాడలో అలీకి ఓ సన్మాన కార్యక్రమం జరిగితే దానికి చంద్రబాబు నాయుడు హాజరవ్వడంతో... అలీ టీడీపీకి జై కొట్టడం ఖాయం అనుకున్నారు.
కానీ అంతలో ఏం జరిగిందో ఏమో... అలీ ఇప్పుడు వైకాపా కండవా వేసుకున్నాడు. ఈరోజు ఉదయం.. జగన్‌ని కలిసిన అలీ.. ఆ పార్టీలో చేరిపోయాడు. మారిన ఎన్నికల సమీకరణాల దృష్ట్యా, తన ప్రాధాన్యతాంశాల దృష్ట్యా అలీ చివరి క్షణంలో ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. అయితే జగన్ కూడా గుంటూరు టికెట్టు నిరాకరించారని తెలుస్తోంది. అలీ కూడా "ఈసారి నేను కేవలం ప్రచారం మాత్రమే చేస్తా. పోటీ చేయను..." అని క్లారిటీ ఇచ్చేశాడు. మరి మొన్నటి వరకూ గుంటూరు టికెట్టు ఇవ్వాలి, మంత్రి పదవి ఇవ్వాలి అంటూ షరతులు పెట్టిన అలీ.. ఆ రెండు డిమాండ్లనీ పక్కన పెట్టేసి, వైకాపా తీర్థం ఎందుకు పుచ్చుకున్నారో మరి.