రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో అలీ పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. గుంటూరు (తూర్పు) నియోజకవర్గం నుంచి ఎం.ఎల్.ఏగా బరిలో దిగడానికి అలీ గత కొంతకాలంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. తనని ఏ పార్టీ ఆహ్వానిస్తే ఆ పార్టీలోకి అడుగుపెట్టాలని ఎదురుచూస్తున్న అలీకి.. టీడీపీ స్వాగత గీతికలు పలికింది.
ఇటీవల విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు అలీని టీడీపీలోకి ఆహ్వానించారు. గుంటూరు నుంచి బరిలోకి దింపుతామని హామీ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకే అలీ.. ఇప్పుడు టీడీపీ పార్టీలో చేరడానికి సమాయాత్తం అవుతున్నారు. గుంటూరు నుంచి పోటీ చేస్తున్నాడు కాబట్టి, ఆ నియోజక వర్గంలో ఓటు హక్కు నమోదు చేయించుకున్నాడు అలీ.
శనివారం గుంటూరులో ఓటు హక్కు కల్పించాలని కోరుతూ తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు అందజేశారు. అయితే అప్పటికే హైదరాబాద్‌లో అలీకి ఓటు హక్కు ఉంది. గుంటూరులో ఓటేయడం కోసం, హైదరాబాద్‌లోని తన ఓటు హక్కుని రద్దు చేసుకున్నాడు అలీ. ఆ రకంగా మొదటి అంకం దిగ్విజయంగా పూర్తయినట్టే. ఇక టీడీపీ తీర్థం పుచ్చుకోవడమే తరువాయి.