కరోనా ప్రభావం అన్ని రంగాల్లోనూ పడింది. ముఖ్యంగా వినోద రంగం కుదేలవుతోంది. విడుదల అవ్వాల్సిన సినిమాలు ఆగిపోవడం, షూటింగులు వాయిదా పడడంతో బాలీవుడ్ నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ కరోనా వల్ల ఇప్పటి వరకూ దాదాపు 1000 కోట్లు నష్టపోయినట్టు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు లెక్కగడుతున్నాయి. మార్చి 6న విడుదలైన బాఘీ 3కి బాలీవుడ్‌లో మంచి స్పందన వచ్చింది. తొలి వారంలోనే దాదాపు 100 కోట్లు కొల్లగొట్టింది. మరో వంద కోట్లు ఖాయంగా రాబడుతుందనుకున్న తరుణంలో థియేటర్లు మూతపడ్డాయి. దాంతో.. బాఘీ 3 నిర్మాతలు తీవ్ర నిరాశకు లోనయ్యారు.
థియేటర్లు మళ్లీ ఎప్పుడు తెరుస్తారో చెప్పలేం. ఈలోగా బాఘీ 3 కి పోటీగా మరిన్ని సినిమాలు రావొచ్చు. బాఘీ 3పై ఆసక్తీ తగ్గిపోవొచ్చు. మరోవైపు అంగ్రేజీ మీడియం కూడా మంచి రివ్యూల్ని సంపాదించుకుంది. తొలి మూడు రోజుల్లో దాదాపు 50 కోట్లు సంపాదించింది. తీరా చూస్తే.. ఆ వెంటనే థియేటర్లు బందయ్యాయి. దాంతో ఆంగ్రేజీ మీడియం నిర్మాతలు భారీగా నష్టపోవాల్సివస్తోంది. ఈ సీజన్లో విడుదల కావాల్సిన బ్రహ్మాస్త్ర, సూర్యవంశీ చిత్రాలు వాయిదా పడ్డాయి. చిత్రీకరణలు ఆగిపోవడం కూడా పెద్ద దెబ్బే. ఎలా చూసినా.. ఈ పది రోజుల్లో 1000 కోట్ల వరకూ నష్టపోవాల్సివచ్చింది. ఇటు దక్షిణాది లో కనీసం 200 నుంచి 300 కోట్లు చేతికి అందకుండా పోయాయి. చిత్రసీమకి ఇది పెద్ద దెబ్బే అనుకోవాలి.