కరోనా కారణంగా అమెరికాలో ఓ సినిమా థియేటర్ క్లోజ్ చేస్తూ ఒక బోర్డ్ పెట్టారు. ''రియల్ లైఫ్.. సినిమాల అనిపించనప్పుడే మళ్ళీ తెరుస్తాం'' అని. నిజమే.. ఇప్పుడు మనిషి జీవితం ఒక పేద్ద సినిమాలా వుంది. కరోనా జీవితాలని తలకిందులు చేసేసింది. ఇప్పుడు అంతా లాక్ డౌన్ లో వున్నారు. లాక్ డౌన్ పోయిన తర్వాత కూడ జీవితాలు నార్మల్ గా మారుతాయని నమ్మకం లేదు. ఎందుకంటే జనాల్లో ఇప్పటికే ఒక భయం వచ్చేసింది. మనిషి.. మరో మనిషి దగ్గరకు వెళ్ళకూడదనే కరోనాసెన్స్ అందరిలోనూ వుంది. దీంతో లాక్ డౌన్ తర్వాత కూడా కొన్ని పరిశ్రమలు మునపటిలా ఉండకపోవచ్చు.
అందులో సినిమా పరిశ్రమ ముందువరసలో వుంటుంది. సినిమా వ్యాపారానికి అడ్డా థియేటర్. ఇప్పుడు ఆ థియేటర్ కి రావడానికి భయపడతారు జనం. ఇదే విషయాన్ని రెండు రోజులు క్రితం సీనియర్ నిర్మాత, తెలుగు రాష్ట్రాలలో నాలుగొందల థియేటర్లు ఉన్న సురేష్ బాబు చెప్పారు. ఈ ఏడాది చివరి వరకు థియేటర్లు తెరుచుకోక పోవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ తెరచిన ప్రజలు థియేటర్ వచ్చేటంత రిస్క్ తీసుకోరని చెప్పుకొచ్చారు సురేష్ బాబు.
ఇప్పుడు దర్శకుడు రాజమౌళి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.'' కరోనా ప్రభావం ఇప్పుడే తగ్గే పరిస్థితి కనిపించడంలేదు. థియేటర్లు నడవడానికి మరో ఆరు నెలలు పట్టే ఛాన్స్ వుంది. ఒకవేళ నడిచినా, కరోనా ప్రభావం తగ్గినా... ప్రజల్లో భయం పోవడానికి సమయం పడుతుంది'' అని చెప్పుకొచ్చారు రాజమౌళి. సురేష్ బాబు, రాజమౌళి లాంటి ప్రముఖల అభిప్రాయాలని చూస్తుంటే.. టాలీవుడ్ 2020ని బ్లాక్ ఇయర్ గా ప్రిపేర్ అయిపోయినట్లు బావించవచ్చు. వాళ్ళ మాటలు చూస్తుంటే.. థియేటర్ టార్గట్ గా తీస్తున్న బడా సినిమాల విడుదల కూడా ఈ 2020లో ఉండకపోవచ్చని అర్ధం చేసుకోవాలి.