కరోనా ప్రభావం తెలుగు సినీ పరిశ్రమపై తీవ్రంగా పడింది. దాదాపు నెల రోజుల నుంచీ థియేటర్లు బంద్. ఈ బందు ఎంత కాలం కొనసాగుతుందో తెలీదు. లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారా, ఎప్పుడు తమ సినిమాల్ని విడుదల చేయాలా? అని దర్శక నిర్మాతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 14 తరవాత కూడా లాక్ డౌన్ ఎత్తేసే పరిస్థితి కనిపించడం లేదు. ఒక వేళ ఎత్తేసినా, నిర్మాతలు ధైర్యం చేసి తమ సినిమాల్ని విడుదల చేస్తారన్న గ్యారెంటీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాల కోసం నిర్మాతలు అన్వేషిస్తున్నారు. అందులో డిజిటల్ రిలీజ్ ఒకటి. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ బాగా పెరిగిపోయాయి.
అమేజాన్, నెట్ ఫ్లిక్స్, ఆహా, జీ 5... ఇలా బోలెడన్ని వేదికలు. సినిమా విడుదలైన నెల రోజుల లోపే ఇందులో కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. దాని ద్వారా నిర్మాతలకు ఆదాయం కూడా బాగానే గిట్టుబాటు అవుతోంది. నిర్మాతలు కూడా ఇప్పుడు ఓటీటీ వేదికలపై దృష్టి సారించారు. సినిమాని థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై విడుదల చేస్తే బాగుంటుందన్నది కొత్త ఆలోచన. థియేటర్లలో విడుదల చేయాలంటే బోలెడంత ప్రచారం అవసరం, థియేటర్ల రెంట్ కట్టాలి.
అన్నీ చేసినా జనాలు థియేటర్లకు వస్తారో, రారో అనే అనుమానం ఉంది. ఇవన్నీ ఎందుకనుకుంటే... డిజిటల్ రీలీజ్ బెటర్. థియేటర్లలో విడుదల చేయకుండా నేరుగా ఓటీటీ వేదికపై చేస్తే.. ఆయా సంస్థలు మరింత ఎక్కువ డబ్బుని ఆఫర్ చేసే అవకాశం ఉంది. లేదంటే... రెవిన్యూని షేర్ చేసుకునే వెసులు బాటు కూడా ఉంది. పెద్ద సినిమాలు ఎలాగూ థియేటర్లు తెరిచేవరకూ ఆగుతాయి. చిన్న సినిమాలకు మాత్రం ఇది బంపర్ ఆఫర్. పరిస్థితి ఇలానే కొనసాగితే.. ఇంకొన్ని రోజుల్లో థియేటర్లో విడుదల కావాల్సిన సినిమాల్ని ఓటీటీలో ఫ్రీగా చూసేయొచ్చు.