కరోనా దెబ్బకి తెలుగు సినీ పరిశ్రమలో షూటింగులు నిలిచిపోయాయి. కరోనా వైరస్ ప్రభావం వున్నప్పటికీ ప్రభాస్ ఎలాగోలా విదేశాల్లో కొంత మేర షూటింగ్ పూర్తి చేసుకొచ్చాడు. ఆ తర్వాత సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్ళాడనుకోండి.. అది వేరే విషయం. ప్రస్తుతం ప్రభాస్ సినిమాకి సంబంధించి కొంత టెక్నికల్ వర్క్‌ని ‘వర్క్ ఎట్ హోమ్’ ప్రాతిపదికన పూర్తి చేసేస్తున్నారట. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ సహా యూనిట్ సిబ్బంది వీడియో కాలింగ్ ద్వారా పనులు చక్కబెట్టేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ కూడా, ఇంటి నుంచే డబ్బింగ్ చెప్పేస్తున్నాడని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ తన తాజా సినిమా ‘వకీల్ సాబ్’ విషయంలోనూ ఇలానే చేస్తున్నాడంటూ ఓ న్యూస్ బయటకు వచ్చిన విషయం విదితమే. అయితే, అది సాధ్యమేనా.? అన్నది వేరే చర్చ. ఈ రెండు సినిమాలే కాదు, మరికొన్ని సినిమాలు కూడా, వర్క్ ఎట్ హోమ్ ప్రాతిపదికన టెక్నికల్ పనులు చక్కబెట్టేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, అదేమంత ఆషామాషీ వ్యవహారం కాదు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ నుంచి ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన వీడియో ప్రోమో విషయంలో ఎంత సమస్య వచ్చిందో చూశాం. ఎలాగైతేనేం, చాలా పట్టుదలగా దాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతానికి చిన్న చిన్న వర్క్స్ కంప్లీట్ చేసుకోగలిగితే, ఆ తర్వాత వాటిని సరిచేసుకుని.. మిగతా పనులు చక్కబెట్టుకోవాలన్న ఆలోచన మంచిదే.