దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న సినిమాల్లో RRR ఒకటి. జనవరి 7న ఈ సినిమా విడుదల అవుతోంది. బడ్జెట్ పరంగా, బిజినెస్ పరంగా ఈ సినిమా ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. బాహుబలి రికార్డులు బద్దలు కొట్టే సినిమాగా RRR ని అభివర్ణిస్తున్నారు సినీ జనాలు. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ దాదాపుగా పూర్తయిపోయింది. ఆ లెక్కలన్నీ వేస్తే... నిర్మాతలు ఇప్పటికే భారీ లాభాల్లో ఉన్నట్టు లెక్క. అయితే.. ఇప్పుడు ఈ సినిమాకి కొత్త తలనొప్పి మొదలైంది.
ఇప్పటికే ఈ సినిమాకి భారీ రేట్లకు కొనేసిన బయ్యర్లు... ఇప్పుడు రేట్లు తగ్గించమని నిర్మాతలపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం. ఏపీ, తెలంగాణలలో పూర్తి స్థాయిలో థియేటర్లు తెరచుకున్నా, ఇప్పటికీ చాలామంది థియేటర్లకు రావడానికి ఇష్టపడడం లేదు. కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో అయితే.. ఇంకా థియేటర్లు తెరచుకోలేదు. ఓవర్సీస్ లో ఒక్క అమెరికాలోనే థియేటర్లు మొదలయ్యాయి. కొన్ని దేశాల్లో ఇంకా ఆ జోలికి వెళ్లలేదు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని, థియేటరికల్ రైట్స్ లో 20 నుంచి 30 శాతం వరకూ మినహాయింపు ఇవ్వాలన్నది బయ్యర్ల డిమాండ్. నైజాంలో ఈ సినిమాని 75 కోట్లకు కొనేశారు. అయితే ఇప్పుడు కాదు.
సెకండ్ వేవ్ కి ముందు. ఇప్పుడు ఈ 75 కోట్లలో 30 శాతం రిబేట్ ఇవ్వాలన్నమాట. జనవరి కి ఇంకా సమయం ఉంది. ఈలోగా.. పరిస్థితులు చక్కబడతాయని నిర్మాతలూ, పంపిణీదారులు ఎదురు చూస్తున్నారు. అదే జరిగితే.. ముందు కోడ్ చేసిన మొత్తానికే ఈ సినిమాని తీసుకుంటారు. లేని పక్షంలో మాత్రం.. కొంత డబ్బు వెనక్కి ఇవ్వాల్సి వస్తుంది. అదే జరిగితే... ఆర్.ఆర్.ఆర్ లాభాలు కొంత మేర తగ్గడం ఖాయం.