2020లో కరోనా మొదలైంది. అప్పటి నుంచీ... ప్రపంచంతో 20 - 20 మ్యాచ్ ఆడేస్తోంది. ఈ ప్రభావం అన్నిరంగాలపై పడింది. చిత్రసీమ కూడా అతీతం కాదు. 2022 - 2021 లో చిత్రసీమ చాలా నష్టపోయింది. 2022లోనూ ఆ ప్రభావం కనిపించబోతోంది. థర్డ్ వేవ్ సూచనలు ముమ్మరంగా ఉన్నాయి. చాలా రాష్ట్రాలలో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారు. నార్త్ లో పరిస్థితి దారుణంగా ఉంది. తెలుగు రాష్ట్రాలలో ఒమైక్రాన్ ప్రభావం తక్కువే. కానీ తీసి పారేయాల్సినంతగా లేదు. కేసులు పెరిగితే.. ఇక్కడా నిబంధనలు మొదలైపోతాయి.
ఒమెక్రాన్ ప్రభావం.. ముందుగా పాన్ ఇండియా సినిమా ఆర్.ఆర్.ఆర్ పై పడింది. ఈ సినిమా ఇప్పుడు వేసవికి వాయిదా పడింది. ఇక మీదట రాబోయే సినిమాలూ ఒమైక్రాన్ తో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఈ యేడాదిలో ఆచార్య, భీమ్లా నాయక్, ఖిలాడీ, సలార్, ఎఫ్ 3, విరాట పర్వం.. ఇలా ఈ లిస్టులో చాలా ఉన్నాయి. ఒక సినిమా వాయిదా పడితే.. మిగిలిన సినిమాలూ తమ విడుదల తేదీ మార్చుకోవాల్సిందే. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ వేసవికి వెళ్తే... వేసవిని టార్గెట్ చేసిన పెద్ద సినిమాలు తమ విడుదల తేదీని మళ్లీ వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్క సినిమా వాయిదాతో 2022 ప్లానింగ్ మొత్తం మారిపోయే ప్రమాదం ఉంది. పరిస్థితులు చేజారి, లాక్ డౌన్ వరకూ వెళ్లిపోతే.. టాలీవుడ్ కి మరో బ్లాక్ ఇయర్ తప్పదు.