జనవరి 14న రాధే శ్యామ్ వస్తుందా? రాదా? ఇప్పుడు అందరిలోనూ ఇదే ప్రశ్న. ఎందుకంటే... జనవరి 7న రావాల్సిన ఆర్.ఆర్.ఆర్ ఒమిక్రాన్ వల్ల వాయిదా పడింది. మరి రాధే శ్యామ్ పరిస్థితి ఏమిటి?
జనవరి 14న మేం తప్పకుండా వస్తాం... అని రాధే శ్యామ్ టీమ్ గట్టిగా చెబుతోంది. పరిస్థితులు ఎలా ఉన్నా సరే.. తగ్గేది లేదు అంటోంది. అయితే మిగిలిన కొన్ని సినిమాలు జనవరి 14న టార్గెట్ చేసుకుంటున్నాయి. డీజే తిల్లు, హీరో వంటి చిన్న సినిమాలు రాధే శ్యామ్ కి పోటీగా రంగంలోకి దిగుతున్నాయి. టిల్లు 14న, హీరో 15న విడుదల అవుతున్నాయి. దిల్ రాజు బ్యానర్ నుంచి రౌడీ బోయ్స్ కూడా జనవరి 14నే రావొచ్చని టాక్.
రాధే శ్యామ్ వస్తే... ఇలా చిన్నా చితకా సినిమాలెందుకు వస్తాయి? అంటే.. రాధే శ్యామ్ వస్తుందన్న నమ్మకం ఎవరికీ లేదన్నమాట. అందుకే చిన్న సినిమాలు వరుస కట్టేస్తున్నాయి. నార్త్ లో థియేటర్ల పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఆంక్షలు విధిస్తున్నారు. కేరళలోనూ... ఆంక్షలు మొదలయ్యాయి. అందుకే ఆర్.ఆర్.ఆర్ వాయిదా పడింది. ఆర్.ఆర్.ఆర్ లా. రాధే శ్యామ్ కూడా పాన్ ఇండియా సినిమానే. సౌత్ తో పాటుగా నార్త్ లో మంచి వసూళ్లు సాధించడం రాధే శ్యామ్ కి చాలా కీలకం. ఇప్పుడున్న పరిస్థితుల్లో నార్త్ నుంచి భారీ వసూళ్లు ఆశించలేరు. అలాంటప్పుడు రాధే శ్యామ్ ఎందుకొస్తుందన్నది పెద్ద ప్రశ్న. జనవరి 10 తరవాత అక్కడి పరిస్థితులు మారొచ్చన్నది రాధే శ్యామ్ నిర్మాతల ధీమా. అలా కాకుండా.. మరింతగా చేజారితే అప్పుడు ఏం చేస్తారు? అంటే రాధే శ్యామ్ జాతకం జనవరి 10 తరవాత తేలుతుందన్నమాట.