దక్షిణాదిన అత్యంత సీనియర్ నటులలో కృష్ణ ముందుంటారని, తెలుగు చిత్రసీమకు ఆయన ఎంతో చేశారని, అయితే ఆయనకు దక్కాల్సిన గౌరవం దక్కలేదని అభిప్రాయ పడ్డారు చిరంజీవి. రెండు తెలుగు ప్రభుత్వాలూ కలసి, ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చేలా కృషి చేయాలన్నారు. కృష్ణకు ఆ పురస్కారం ఇవ్వడం తెలుగువాళ్లందరికీ గర్వకారణమన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి మహేష్ ప్రస్థానాన్ని, సాధిస్తున్న విజయాల్ని ప్రస్తావించారు.
''ఒకప్పుడు కృష్ణగారి అబ్బాయి మహేష్ అనుకునేవారు. ఇప్పుడు మహేష్ గారి నాన్న కృష్ణ అనుకునే స్థాయికి చేరాడు. తనని చూసి కృష్ణగారు ఎంతో గర్వపడుతుంటారు. అదెలా ఉంటుందో ఓ తండ్రిగా నాకు తెలుసు. ఈ సినిమాని చాలా తక్కువ రోజుల్లో పూర్తి చేశారని తెలిసి ఆనందించాను. అడ్వాన్సు కూడా తీసుకోకుండా ఈ సినిమాని మహేష్ పనిచేశాడు. అలా అడ్వాన్సు తీసుకోకపోవడం వల్ల నిర్మాతలు లాభపడతారు. వడ్డీలు కలిసొస్తాయి. ఇప్పటి హీరోలంతా వేగంగా సినిమాలు తీయాలి. అప్పుడే పరిశ్రమ కళకళలాడుతుంది'' అన్నారు చిరు.