ఇటీవల చైనాలో విడుదలైన 'దంగల్' సినిమా సంచలనాలు సృష్టించేస్తోంది. విడుదలైన రోజు నుండే రికార్డులు మొదలెట్టేసింది. అక్కడ ఇప్పటికే 400 కోట్లు దాటేసింది. ఇంకా విజయవంతంగా రన్ అవుతోంది. త్వరలోనే 500 కోట్లు దాటేయడానికి పరుగులు తీస్తోంది. ఏ క్షణాన అయినా 500 కోట్లు మార్క్ దాటేయవచ్చునని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. అమీర్‌ఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రం, 'బాహుబలి-2' వచ్చేదాకా ఇండియాలోనే అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది. అంత వరకూ 800 కోట్ల పైన వసూలు చేసిన 'దంగల్' చైనాలో విడుదలయ్యాక వెయ్యి కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. ప్రస్తుతం 'బాహుబలి-2'తో పోటీ పడుతోంది 'దంగల్'. అయితే చైనాలో విడుదల చేయాలన్న నిర్ణయం ఆలస్యంగా తీసుకోవడంతో వెయ్యి కోట్ల వసూళ్ళు సాధించిన తొలి చిత్రంగా రికార్డులకెక్కే అవకాశం తృటిలో కోల్పోయింది 'దంగల్'. చైనాలో ఈ సినిమాని ముందుగానే విడుదల చేసుంటే ఆ రికార్డు మొదటగా ఈ సినిమాకే దక్కేదని బాలీవుడ్ అంచనా. రెజ్లింగ్ నేపధ్యంలో వచ్చిన ఈ సినిమాని మెచ్చుకోని వారు లేరు. ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఇలాంటి సినిమాల్ని అందరూ ఆదరించి తీరాలి. అమీర్ ఖాన్ చేసిన సాహసం వృధా పోలేదు. నలుగురు కూతుళ్లకు తండ్రిగా అమీర్ ఖాన్ నటన అద్భుతహ అనిపిస్తుంది ఈ సినిమాలో. అందుకే ఈ సినిమా రికార్డులకు నెలవైంది.