దాసరి అంటే ఒక ధైర్యం.. దాసరి అంటే ఒక నమ్మకం.. ఒక దర్శకుడి విలువలు పెంచిన వ్యక్తి శ్రీ దాసరి నారాయణ రావు గారు.
మే 4, 1947న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో జన్మించిన ఆయన, 1971 లో మద్రాస్ కి వెళ్లి దర్శకుడిగా తాత మనువడు చిత్రంతో తెలుగు చిత్ర సీమకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత సంసారం సాగరం, బంట్రోతు భార్య, స్వర్గం నరకం, యవ్వనం కాటేసింది, కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడీ చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.
తెలుగు చిత్ర సీమకి రెండు కళ్ళైన నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వర రావు గారు వంటి మహానటులతో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశారు. మనుషులంతా ఒక్కటే, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి వంటి చిత్రాలు నందమూరి తారక రామారావు గారితో, అలాగే అక్కినేనితో ప్రేమాభిషేకం, ఆది దంపతులు, బంగారు కుటుంబం వంటి సందేశాత్మక చిత్రాలు తెరకెక్కించి దర్శకరత్న బిరుదుని సొంతం చేసుకున్నారు. దర్శకుడిగా 151 చిత్రాలు తెరకెక్కించారు, అందులో దాదాపు అన్ని ఆణిముత్యాలే... ఒక నటుడిగా, నిర్మాతగా కూడా రాణించారు.
దర్శక రత్నగా అగ్ర కథానాయకులతోనే కాకుండా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఎందరికో అవకాశాలిచ్చారు. తెలుగు చిత్రసీమలో ఏ క్రాఫ్ట్ అనేది లేకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా అక్కున చేర్చుకున్నారు. అలాంటి మహానుభావుడు స్వర్గస్తులు అయ్యి ఈ రోజుతో ఒక సంవత్సరం గడిచిన సందర్భంగా ఒకసారి ఆ మహానుభావుణ్ణి స్మరించుకుందాం. ఇలా ఎన్ని సంవత్సరాలు గడిచినా అందరి హృదయాల్లో ఆయన బ్రతికే ఉంటారు.