పునీత్ రాజ్ కుమార్ చివరి రోజులు ఉత్సాహవంతంగా గడిచాయి. మరణానికి రెండు రోజుల ముందు `జై భజరంగీ` ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పాల్గొన్న పునీత్... తన సోదరుడుతో కలిసి వేదిక పై స్టెప్పులు వేసిన వీడియో.. ఇప్పుడు వైరల్ గా మారింది. అంతేకాదు... గురువారం రాత్రి ఆయన ఓ పార్టీలో పాల్గొన్నారు. సంగీత దర్శకుడు గురుకిరణ్ పుట్టిన రోజు వేడుకలో పునీత్ ఉత్సాహంగా గడిపారు. అక్కడ పాటలు పాడుతూ డాన్సులుచేశారు. కానీ.. తెల్లారే సరికి, పునీత్ మరణ వార్త వినాల్సివచ్చింది. అదే... అభిమానులకు జీర్ణం కావడం లేదు.
గురువారం రాత్రి ఆయన కాస్త అస్వస్థతకు గురయ్యారని సన్నిహితులు చెబుతున్నారు. గుండెల్లో కాస్త నొప్పిగా అనిపించిందట. అయినా సరే, ఉదయం ఎప్పటిలానే జిమ్ కి వెళ్లారు. కసరత్తులు చేశారు. ఎంత అనారోగ్యంగా ఉన్నా, జిమ్ కి వెళ్లడం పునీత్ కి బాగా అలవాటు. ఆ అలవాటే ఇప్పుడు ఆయన ప్రాణం తీసింది. గుండెల్లో నొప్పిగా ఉండి కూడా జిమ్ చేయడం వల్లే... ఆయన ప్రాణాలు కోల్పోవాల్సివచ్చిందని సన్నిహితులు చెబుతున్నారు. ఆయన గనుక.. ఒక్క రోజు విశ్రాంతి తీసుకుని ఉండుంటే.. పరిస్థితి మరోలా ఉండేదని వాపోతున్నారు. పాపం.. ఇప్పుడు ఎన్ని అనుకుని ఏం లాభం? జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఓ తార.. నేల రాలిపోయింది.