దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'పద్మావత్' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజ్‌పుత్ రాణి పద్మిణీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఎన్ని వివాదాలను ఎదుర్కందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎట్టకేలకు జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి, సినిమా విజయం సాధించింది. అయితే ఈ విజయం అసలు విజయం కాదట దీపికా దృష్టిలో.
సినిమాలో ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవనీ ఎంత చెప్పినా వినిపించుకోకుండా, సినిమా విడుదలపై పలు వివాదాలు సృష్టించిన వారు ఈ సినిమా చూడాలి. చూసి సినిమాని అభినందించాలి. అప్పుడే 'పద్మావత్' అసలు సిసలు విజయం సాధించినట్లు అని దీపిక అంటోంది. ఇప్పుడు దీపిక మాటే నిజమైంది. సినిమాపై పలు వివాదాలు సృష్టించిన కర్ణిసేన తాజాగా ఈ సినిమాని చూసిందట. సినిమాలో ఎలాంటి అభ్యంతరకర సీన్లు లేవనీ, రాజ్‌పుత్‌ల శౌర్యాన్ని, గౌరవాన్ని నిలిబెట్టేలా ఉందనీ రాజ్‌పుత్ కర్ణిసేన క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చింది. అంతేకాదు సినిమాపై ప్రశంసల జల్లు కురిపించింది.
అయితే సినిమాకి జరగాల్సిన నష్టం ఆల్రెడీ జరిగిపోయింది. ఈ వివాదాలతో సినిమా చాలా రాష్ట్రాల్లో విడుదల కాలేదు. దాంతో వసూళ్ల పరంగా సినిమాకి భారీ నష్టం జరిగింది. 200 కోట్ల క్లబ్‌లోకి త్వరలో చేరబోతోంది 'పద్మావత్'. ఒకవేళ అనుకున్న సమయానికి విడుదలై ఉండి, బ్యాన్ చేసిన రాష్ట్రాల్లో కూడా సినిమా విడుదలై ఉంటే, ఎప్పుడో 200 కోట్ల క్లబ్‌లోకి చేరి ఉండేది. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిందీ సినిమా.