ప్రభాస్ అభిమానుల కోసం ఓ బంపర్ న్యూస్ బయటకు వచ్చేసింది. ప్రభాస్ తో దీపిక పదుకొణె నటిస్తోందన్న వార్త.... కొత్త కిక్ ఇచ్చింది. నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. వైజయంతీ మూవీస్ నిర్మిస్తోంది. పాన్ ఇండియా సినిమా కాబట్టి - బాలీవుడ్ కథానాయికనే ఎంచుకుంటారని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. దీపిక పేరు గట్టిగానే వినిపించింది. చివరికి తనే ఖాయమైంది.
ఈ సినిమా కోసం దీపిక పదుకొణెకి 30 కోట్ల పారితోషికం ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ కథానాయికల్లో టాక్ 1 పొజీషన్ దీపికదే. కాబట్టి ఆ మాత్రం పారితోషికం ఇవ్వడంలో తప్పేం లేదు. కాకపోతే.. బాలీవుడ్ లో దీపిక అందుకునే పారితోషికం 20 కోట్లలోపే. బడా స్టార్లున్న సినిమాల్లో సైతం దీపికకు 15 కోట్లకు మించి ఇవ్వరు. సౌత్ ఇండియా సినిమా అనేసరికి బాలీవుడ్ భామలు చెట్టెక్కి కూర్చుంటారు. అడిగినంత ఇస్తారులే అన్న ధీమా వాళ్లది. అయితే.. ఈ సినిమా కోసం దీపికకు 20 కోట్లే ఇచ్చారని తెలుస్తోంది. అది కూడా అన్ని ఖర్చులతో సహా. దీపిక సహాయక సిబ్బందికి సైతం దీపికనే పారితోషికాలు చెల్లించాల్సి ఉంటుంది. దాంతో.. చిత్రబృందానికి ఎలాంటి సంబంధం ఉండదు. అగ్రిమెంట్ ప్రకారం దీపిక కనీసం 40 నుంచి 50 రోజుల వరకూ కాల్షీట్లు ఇవ్వాల్సివుంటుంది. కాల్షీట్ల సంఖ్య పెరిగితే.. అప్పుడు అదనంగా పారితోషికం ఇస్తారు. ప్రమోషన్లకు సైతం.. కొన్ని ప్రత్యేకమైన కాల్షీట్లు ఇచ్చింది దీపిక. కనీసం వారం రోజుల పాటు ప్రమోషన్లలో పాల్గొంటానని దీపిక ఆఫర్ ఇచ్చిందని తెలుస్తోంది. ఇదంతా ప్రభాస్ పై అభిమానమా? లేదంటే.. సౌత్ ఇండియాలోని దర్శక నిర్మాతల్ని ఆకర్షించడానికా? అన్న ఆసక్తి నెలకొందిప్పుడు.