లాక్ డౌన్ వల్ల... థియేటర్లు మూసేయడం వల్ల, వెబ్ సిరీస్ లకు ఆదరణ పెరిగింది. రానున్న రోజుల్లో వెబ్ సిరీస్‌లు మరింత ప్రభావం చూపిస్తాయని దర్శక నిర్మాతలు నమ్ముతున్నారు. అందుకే బడా బడా దర్శకులు, నిర్మాతలు వెబ్ సిరీస్‌ల పై దృష్టి సారిస్తున్నారు. ఆజాబితాలో సుకుమార్ కూడా చేరాడు. సుకుమార్ రైటింగ్స్ పై ఓ వెబ్ సిరీస్ నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో తొమ్మిది ఎపిసోడ్లు ఉంటాయట. ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో ప్రేమకథ. ఆ ప్రేమకథకు ఒక్కో దర్శకుడు. అందులో ఒక్కో హీరో కనిపిస్తాడు. ఇదీ.. సుకుమార్ ప్లానింగ్.
సరిగ్గా ఇదే స్టైల్ లో మణిరత్నం `నవరస` రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. మణిరత్నం నవరసాలూ.. ప్రధానంగా చేసుకుని వెబ్ సిరీస్ తీస్తుంటే సుకుమార్ మాత్రం ప్రేమ అనే పదార్థం చుట్టూనే ఈ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నాడు. అన్నట్టు ఈ వెబ్ సిరీస్‌కి ఓ ఇంగ్లీష్ నవల ఆధారమట. ఆ హక్కుల్ని సుకుమార్ భారీ రేటుతో కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఏదైతేనేం... మొత్తానికి సుకుమార్ కూడా వెబ్ సిరీస్ బాట పట్టేశాడు.