ఆర్.ఆర్.ఆర్‌పై పెద్ద దెబ్బ పడింది. ఈసారి ఢిల్లీ ప్రభుత్వం రూపంలో. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఎల్లో ఎలెర్ట్ ప్రకటించారు. దాంతో థియేటర్లన్నీ మూసేశారు. ఈ దెబ్బకి బాలీవుడ్ `జెర్సీ` వెనుకంజ వేసింది. ఈ ప్రభావం ఆర్.ఆర్.ఆర్ పై తీవ్రంగా పడబోతోంది. జనవరి 7న ఆర్.ఆర్.ఆర్ విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అప్పటికి ఢిల్లీలో థియేటర్లు ఓపెన్ అవ్వకపోతే... దాదాపుగా రూ.100 కోట్ల మేరకు నష్ం వచ్చే అవకాశం ఉంది.
బాలీవుడ్ లెక్కల ప్రకారం.. ఢిల్లీ చాలా కీలకమైన మార్కెట్. హిందీ సినిమాలకు ఢిల్లీ మార్కెట్ ఆయువుపట్టు. బాహుబలి 2 అక్కడ దాదాపు వంద కోట్లు సాధించింది. ఆర్.ఆర్.ఆర్ దాదాపుగా రూ.130 కోట్ల వరకూ వసూలు చేయగలదని అక్కడి ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ లో థియేటర్లు బంద్ అవ్వడం షాక్ ఇచ్చే అంశం. ఎంత కాదన్నా... దాదాపుగా రూ.100 కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది. అయినా సరే.. ఆర్.ఆర్.ఆర్ విడుదల చేసే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో సినిమా ఆపితే, వంద కోట్ల కంటే ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఢిల్లీ బాటలో మిగిలిన రాష్ట్రాలూ థియేటర్లని బంద్ చేస్తే.. అప్పుడు వాయిదా వేసుకోవడం తప్ప మరో మార్గం ఉండదు.