ఈ వారం దేవి ఎలిమినేషన్ బిగ్ బాస్ అభిమానులకు షాక్ ఇచ్చింది. `దేవి బయటకు రావడం ఏమిటి?` అంటూ అంతా ఆశ్చర్యపోయారు. దేవిని మళ్లీ వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టేలా చేయాలన్న డిమాండ్ సోషల్ మీడియాలో కాస్త గట్టిగానే వినిపిస్తోంది. దేవి హేటర్స్ కూడా.. `దేవి ఇంకొన్నాళ్లు హౌస్‌లో ఉంటే బాగుండేది` అంటున్నారు. కమ్ బ్యాక్ దేవి పేరుతో ఓ హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. ఎలిమినేట్ అయినవాళ్లని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్లీ తిరిగి తీసుకునే విధానం బిగ్ బాస్ లో ఉంది. దేవి కూడా మళ్లీ ఈ హౌస్ లోకి అడుగుపెడుతుందా? అనే ఆరాలు మొదలయ్యాయి ఇప్పుడు. దీనిపై దేవి స్పందించింది.
''వైల్డ్ కార్డ్ ద్వారా ఎలిమినేట్ అయినవాళ్లు మళ్లీ బిగ్ బాస్ హౌస్ లో తిరిగి అడుగుపెట్టే అవకాశం ఉంది. కానీ.. ఈసారి మాత్రం ఆ అవకాశాలు తక్కువలా అనిపిస్తున్నాయి. ఎందుకంటే 14 రోజుల క్వారెంటైన్ నిబంధన వల్ల అది సాధ్యం కాకపోవొచ్చు. నిజంగానే అలాంటి అవకాశం వస్తే మాత్రం నేను తప్పకుండా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడతా. ఎందుకంటే నేను బయటకు వచ్చాక.. ప్రజల స్పందన నేరుగా తెలుసుకున్నా.
నన్ను మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకోవాలని సోషల్ మీడియాలో ఓ ఉద్యమమే నడుస్తోంది. ఇవన్నీ నన్ను సంతోష పెట్టే విషయాలే. ఒకవేళ నేను బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టకపోయినా ఫర్వాలేదు. ఈ ప్రేమ, అభిమానం నాకు చాలు'' అంటోంది.