ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై నటి కరాటే కల్యాణీతో పాటు, కొంతమంది బీజేపీ నేతలు, హిందుత్వ సంఘాలు కేసులు వేశారు. వివరాల్లోకి వెళ్తే..
ఇటీవల ఆయన `ఓపరి` అనే ఓ వీడియో ఆల్బమ్ లో నటించారు. ఆ పాటని టీ సిరీస్ ఈ పాటని రూపొందించి విడుదల చేసింది.
ఈ పాట యూ ట్యూబ్ లో కొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. అయితే... కొంతమంది హిందుత్వ వాదులకు ఈ పాట నచ్చలేదు. అందులో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విషయాలు ఉన్నాయన్నది వారి ఆరోపణ. కోట్లాది మంది హిందవులు జపించే.. హరే రామ, హరే కృష్ణ మంత్రాన్ని ఐటెమ్ సాంగ్ కి వాడుతూ, బికినీలతో డాన్స్ చేయడం అభ్యంతరకరంగా ఉందన్నది వారి వాదన. తక్షణం అన్ని లింకుల నుంచీ ఈ పాటని తొలగించాలని, లేనిపక్షంలో తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు కరాటే కల్యాణీ... హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ లో దేవిశ్రీ ప్రసాద్ పై ఫిర్యాదు చేసింది. దేవిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరింది. ఇది వరకు..` ఊ.. అంటావా మామా` పాటపై కూడా ఇలానే అభ్యంతరాలు వచ్చాయి. మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఫిర్యాదులు వెళ్లాయి. ఆ వివాదాల తరవాతే పాట మరింత పాపులర్ అయ్యింది. ఈసారీ అదే జరుగుతుందేమో...?