తెలుగులో తన మ్యూజిక్‌లో పలువురు హీరోలతో పాటలు పాడించేశాడు మ్యూజిక్ మెజీషియన్ దేవిశ్రీ ప్రసాద్. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఇలా తదితర హీరోలు దేవి మ్యూజిక్‌లో తమ గొంతు సవరించుకున్న వాళ్లే.
లేటెస్టుగా దేవిశ్రీ ప్రసాద్ తమిళంలో విక్రమ్ హీరోగా నటిస్తున్న 'సామి 2' చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో హీరో విక్రమ్ చేత కూడా ఓ పాట పాడించాలని అనుకుంటున్నాడట. అయితే విక్రమ్ కేవలం నటుడు మాత్రమే కాదు, మల్టీటాలెంటెడ్. తన గొంతును ఇతర హీరోలకు అద్దెకిస్తూంటాడు. అలాగే తన సొంత గాత్రంలో పలు చిత్రాలకు పాటలు కూడా పాడాడు. గతంలో 'కందసామి' చిత్రం కోసం ఏకంగా నాలుగు పాటలు పాడాడు విక్రమ్. ఈ కోవలోనే తాజాగా దేవి మ్యూజిక్‌లో విక్రమ్ ఓ పాట పాడబోతున్నాడనీ తెలుస్తోంది.
అయితే ఇంకా ఫైనల్ కాలేదు కానీ, దేవిశ్రీ ప్రసాద్, విక్రమ్ చేత ఓ స్పెషల్ సాంగ్ పాడించాలని అనుకుంటున్నాడట. డైరెక్టర్ మిత్రన్ ఆర్డరేస్తే, ఖచ్చితంగా విక్రమ్‌తో సాంగ్ పాడిస్తానని దేవిశ్రీ ప్రసాద్ అంటున్నాడు. ఇకపోతే గతంలో విక్రమ్ నటించిన 'సామి' చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది 'సామి 2'. మొదటి పార్ట్‌లో త్రిష హీరోయిన్‌గా నటించింది. ఈ సీక్వెల్‌లో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మధ్య విక్రమ్‌కి సరైన హిట్స్ పడడం లేదు. 'సామి 2'పై భారీగా ఆశలు పెట్టుకున్నాడు.
కీర్తి సురేష్ ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ కూడా 'మహానటి'తో సూపర్‌డూపర్ హిట్ కొట్టి, స్టార్ హీరోయిన్స్ రేంజ్‌కి వెళ్లిపోయింది. చూడాలి మరి కీర్తి లక్ విక్రమ్‌కి కలిసొచ్చి 'సామి 2' సక్సెస్ అవుతుందేమో. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.