రాజమౌళి సినిమా అంటే నో డౌట్... బాక్సులు బద్దలైపోవాల్సిందే. తన దిగ్విజయ యాత్ర అలాంటిది. ఇప్పటి వరకూ అపజయం ఎరుగని దర్శకుడు ఆయన. ఇలాంటి రికార్డ్ ఇండియాలో ఉన్న దర్శకుడు ఇతనకొక్కడే. ఏ సినిమా తీసినా వావ్ అనాల్సిందే. అది కూడా ఏక గ్రీవంగా. ముక్త కంఠంతో.
కానీ తొలిసారి `ఆర్.ఆర్.ఆర్`కి డివైడ్ టాక్ వినిపిస్తోంది. `ఇది అద్భుతం` అని కొందరు, `ఓకే.. ఓకే సినిమా` అని కొందరు, `రాజమౌళికి తొలి ఫ్లాప్` అని ఇంకొందరు.. ఎలా ఎవరి మాట, ఎవరి రివ్యూ వాళ్లదే. ఇది వరకెప్పుడూ రాజమౌళి సినిమాకి ఇంత డివైడ్‌టాక్ రాలేదు. అయితే.. ఇలా భిన్న స్వరాలు వినిపించడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిని ఒకొక్కటిగా పరిశీలిస్తే...
1. ఈసినిమాలో కథ.. బలహీనంగా ఉంది. ఓ పాపని బ్రిటీషర్లు ఎత్తుకొస్తే, ఆ పాప కోసం కొమరం భీమ్ వస్తాడు. కొమరం భీమ్ నుంచి బ్రిటీష్ వాళ్లని కాపాడే బాధ్యత రామ్ చరణ్‌ది అదే కథ. ఇంత చిన్న లైన్ కోసం ఇద్దరు స్టార్ హీరోలు ఎలా సరిపోతారని రాజమౌళి భావించాడో? అనేది కొంతమంది అభిమానుల మాట.
2. ఈ సినిమాలో ఎమోషన్స్ వీక్. రాజమౌళి ఎప్పుడూ ఎమోషన్లతో ఆడుకుంటాడు. ఒకట్రెండు సందర్భాల్లో తప్ప ఎమోషన్స్ పండించే ఛాన్స్ రాజమౌళికి దక్కలేదన్నది ఇంకొందరి వాదన.
3. ఫ్లాష్ బ్యాక్ బలహీనం. ఇది నూటికి నూరుపాళ్లూ కరెక్టే. ఈ సినిమాకి పాజిటీవ్ రిపోర్ట్ ఇస్తున్న వాళ్లు కూడా.. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ మైనస్ అని తేల్చేశారు
4. అజయ్ దేవగణ్, శ్రియ పాత్రలెందుకు? వాళ్ల స్థాయికి తగిన పాత్రలు కావవి.
5. కొన్ని చోట్ల వీఎఫ్ఎక్స్ తేలిపోవడం.
6. క్లైమాక్స్ కూడా వీకే. అప్పటి వరకూ భారీ యాక్షన్ దృశ్యాలు చూపించిన రాజమౌళి.. క్లైమాక్స్‌కి వచ్చేసరికి తొందరగా తేల్చేశాడన్నది అందరి మాట.
7. బాహుబలి తరవాత అంతకంటే మించిన సినిమా తీస్తాడని అంతా ఆశిస్తారు. కానీ బాహుబలికీ, ఆర్.ఆర్.ఆర్ కీ చాలా తేడా ఉంది. బాహుబలిలా ఆర్.ఆర్.ఆర్ విజువల్ వండర్ కాదు. ఎమోషన్స్ మీద నడిచే కథ. ఆ ఎమోషన్స్ మిస్ అవ్వడం ప్రధాన మైన లోపం.
8. అల్లూరి, కొమరం భీమ్ కథలని చెప్పి, అందులో ఫాంటసీ మిక్స్ చేయడం ఎవరికీ నచ్చడం లేదు. ముఖ్యంగా అల్లూరి, కొమరం అభిమానులకు.
9. ఈ సినిమాలో ఉన్న రెండు లవ్ ట్రాకులూ.. బలహీనంగానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా అలియా భట్ ని బాలీవుడ్ నుంచి తీసుకొచ్చారు గానీ, ఆమె స్టార్ డమ్‌కి గానీ, తనలోని నటికి గానీ సరిపోయే పాత్ర కాదది.
10. అన్నింటికంటే మించి మితిమీరన అంచనాలు ఈ సినిమాని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. అభిమానులు ఏదేదో ఊహించుకుని వెళ్లారు. తెరపై తాము ఆశించిన దానికంటే తక్కువ కనిపించింది. అందుకే కొంత నిరాశ.