తెలుగులో ఫ్రాంచైజీ చిత్రాలు ఆడడం చాలా అరుదు. అయితే కార్తికేయ ఈ ట్రెండ్ ని బీట్ చేసింది. కార్తికేయ 1 కంటే, కార్తికేయ 2 సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో నిఖిల్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు అందరి దృష్టీ కార్తికేయ 3పై పడింది. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? ఏ స్థాయిలో ఉంటుంది? అనే ఆలోచనలు మొదలైపోయాయి. వీటిపై నిఖిల్ పూర్తి క్లారిటీ ఇచ్చేశాడు.
``2023లో కార్తికేయ 3 ఉంటుంది. కథ ఇప్పటికే సిద్ధంగా ఉంది. కార్తికేయ 2 తరవాత నాకు పాన్ ఇండియా ఆఫర్లు ఎక్కువగా వస్తున్నాయి. కానీ నేను ఏదీ ఒప్పుకోలేదు. ఒకవేళ నేను పాన్ ఇండియా సినిమా చేస్తే... అది కార్తికేయ 3తోనే. ప్రస్తుతం నా చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. అవన్నీ పూర్తయిన తరవాత కార్తికేయ 3 మొదలెడతాం`` అని చెప్పుకొచ్చాడు నిఖిల్. తను నటించిన `18 పేజెస్` ఈ వారంలోనే విడుదల అవుతోంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడు. ఈ చిత్రానికి సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందించడం విశేషం.