మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. అయితే ఆ 'త్వరలో' ఎప్పుడున్నదానిపై స్పష్టత రావడంలేదింకా. ఆగస్ట్ 15వ తేదీన చిరంజీవి కొత్త సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ విడుదలవుతుందని అభిమానులు ఆశించారు. కానీ ఆగస్ట్ 15న కాకుండా, ఆగస్ట్ 22నే టైటిల్ విడుదల చేయాలని అనుకుంటున్నారట. ముందుగా ఈ సినిమాకి 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' అనే టైటిల్ అనుకున్నారు. ఆ తర్వాత 'మహావీర' అనే ఇంకో పేరు తెరపైకి వచ్చింది. టైటిల్ డిజైన్ విడుదలయితే తప్ప, టైటిల్ మీద స్పష్టత రాదు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున టైటిల్ రివీల్ చేసి ఉంటే సినిమాకి మంచి మైలేజ్ ప్రారంభోత్సవానికి ముందే వచ్చి ఉండేది. ఎందుకంటే సినిమా స్వాతంత్య్ర పోరాటం నేపథ్యంలో రూపొందనుంది గనుక. ఎక్కడా ఏ చిన్న విషయంలోనూ కాంప్రమైజ్ కాకూడదనే అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటుండడం అభినందనీయమే. అయితే 2017 సంక్రాంతికి మెగాస్టార్ 'ఖైదీ నెంబర్ 150' సినిమాతో సందడి చేయడంతో, ఈ ఏడాదే ఇంకో సినిమా చిరంజీవి నుంచి రావాలని అభిమానులు కోరుకున్నారు. వారి సరదా వారిది. కానీ చిరంజీవి ఆలోచనలు వేరేలా ఉన్నాయి. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో విజయాల్ని చవిచూసిన చిరంజీవి, కొత్త ఇన్నింగ్స్‌లో చేసే ప్రతి సినిమా ప్రతిష్టాత్మకం అవ్వాలనుకుంటున్నారు. మెగాస్టార్ ఆలోచనలకి హేట్సాఫ్ చెప్పాల్సిందే.