రౌడీ బోయ్స్ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా అడుగు పెట్టాడు ఆశీష్. నిర్మాత శిరీష్ తనయుడు అవ్వడం, దిల్ రాజు అండదండలు ఉండడంతో... తొలి సినిమాకి బాగానే పబ్లిసిటీ చేశారు. బాగా ఖర్చు పెట్టారు. టాక్ ఎలా ఉన్నా, హీరోగా ఆశిష్ పాసైపోయాడు. రెండో సినిమా కూడా దిల్ రాజు గట్టిగానే ప్లాన్ చేశాడు.
సుకుమార్ బ్యానర్‌లో... ఆశిష్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్ తో పాటు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. సుకుమార్ శిష్యుడు కాశీ ఈ సినిమాతో దర్శకుడిగా పనిచయం అవుతున్నాడు. సంభాషణలు కూడా సుకుమారే అందించనుండడం విశేషం. ఈ చిత్రానికి `సెల్ఫిష్` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. దిల్ రాజుతో సుకుమార్‌కి ప్రత్యేక అనుబంధం ఉంది. దర్శకుడిగా సుకుమార్ కెరీర్‌కి క్లాప్ కొట్టింది దిల్ రాజునే. అందుకే ఇప్పుడు ఆశిష్ బాధ్యతను సుకుమార్ చేతిలో పెట్టాడు. సుకుమార్ కూడా తన శిష్యుల్ని తెలివిగా ప్రమోట్ చేసుకుంటూనే, తన బ్యానర్ వాల్యూ పెంచుకుంటున్నాడు. తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం... ఇదీ సుకుమార్ స్ట్రాటజీ.