గాసిప్ రాయుళ్లపై, కేవలం వ్యూస్ కోసం అడ్డమైన రాతలు రాసే యూ ట్యూబ్ ఛానళ్లపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫైర్ అయ్యారు. నిజాలు తెలుసుకొని రాయాలని, లేదంటే మూసుకుని కూర్చోవాలని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కార్తికేయ 2ని నిర్మాత దిల్ రాజు అడ్డుకోవాలని చూశారని, ఆ సినిమాని తొక్కేయాలనుకొన్నారని ఇటీవల కొన్ని కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు ఈ కామెంట్లు చేశారు. కార్తికేయ 2 సక్సెస్ మీట్ లో దిల్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాని ఉద్దేశించి కౌంటర్లు వేశారు.
''మీ వ్యూస్, క్లిక్కులు, సబ్‌స్ర్కైబర్ల కోసం నా పేరును పాడు చేయవద్దు. మీరు తొక్కితే తొక్కించుకునేంత చేతకాని వారెవరూ లేరిక్కడ. అసలు ఏమీ తెలుసుకోకుండానే మీడియా రాద్ధాంతం మొదలు పెట్టింది. సాధారణంగా నేను ఎవరితోనూ గొడవలు పెట్టుకోను. ‘కార్తికేయ 2’ వదంతి నన్ను చాలా అప్సెట్ చేసింది. మీడియా నన్ను బలిపశువును చేసింది'' అని విచారం వ్యక్తం చేశారు దిల్ రాజు.
ఒక పక్క ఐదు సినిమాలు ఆడుతున్నా.. ‘కార్తికేయ 2’ నైజాంలో రూ. 4 కోట్లు వసూలు చేసిందనీ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లాంటి నిర్మాణ సంస్థ ని ఎవరూ తొక్కలేరని, వారిని తొక్కేంత దమ్ము టాలీవుడ్‌లో ఎవరికీ లేదని, మీడియాకి కొంచెమైనా కామన్‌సెన్స్ ఉండాలని ఇప్పుడొక సినిమా మరో సినిమాకి ఊపిరి పోస్తోందని... దిల్ రాజు వ్యాఖ్యానించారు.