తెలుగు చిత్రసీమలో రారాజు.. దిల్ రాజు. ఆయన ఓ సినిమా తీసినా, కొన్నా.. అది హిట్ అవ్వడం ఖాయం. ఎందుకంటే ఆయన లెక్కలు అలా ఉంటాయి. పోస్టర్‌ని చూసి.. సినిమా జాతకం చెప్పేస్తారు. అందుకే వరుస విజయాలు అందుకొంటున్నారు. అయితే... బాలీవుడ్ లో దిల్ రాజు పప్పులు ఉడకడం లేదు. లెక్కలన్నీ తప్పేస్తున్నాయి. మొన్నటికి మొన్న జెర్సీని బాలీవుడ్ లో రీమేక్ చేసి, విడుదల చేశారు. అది అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాతో దిల్ రాజు బాగా నష్టపోయారని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
ఈ శుక్రవారం బాలీవుడ్ లో `హిట్` సినిమా రిలీజ్ అయ్యింది. తెలుగులో విజయవంతమైన `హిట్`కి అది రీమేక్. అయితే.. ఈ సినిమా కూడా ఫ్లాపే. రాజ్‌కుమార్ రావు హీరోగా నటించిన `హిట్` బాలీవుడ్ ప్రేక్షకుల్ని ఆకర్షించలేకపోయింది. ఈ సినిమాకి శుక్రవారం ఓపెనింగ్సే లేవు. దాంతో వరుసగా రెండు ఫ్లాపుల్ని చవి చూడాల్సివచ్చింది.
తెలుగులో విజయవంతమైన `నాంది` రీమేక్ రైట్స్ దిల్ రాజు దగ్గర ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఇలా వరుసగా రెండు పెద్ద ఫ్లాపులు పడేసరికి.. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసే అవకాశం ఉందని సమాచారం.