దిల్ రాజు రెండో పెళ్లి - ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్. దిల్రాజు మొదటి భార్య రెండేళ్ల క్రితమే మరణించారు. ఆ తరవాత ఆయన ఒంటరిగానే ఉన్నారు. అయితే ఈమధ్య మరో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది. అప్పటి నుంచీ మీడియాలో రకరకాల కథనాలు వస్తూనే ఉన్నాయి. దిల్ రాజుని పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి దగ్గరి నుంచి, ఈ పెళ్లి విషయంలో దిల్ రాజు కుటుంబ సభ్యుల అభిప్రాయాల వరకూ అన్ని రకాల కోణాల్లోనూ కథనాలు అల్లేసింది మీడియా. తాజాగా దిల్ రాజు రెండో పెళ్లి రహస్యంగా అయిపోయిందంటూ ఓ వార్త పేల్చింది.
ఓ ప్రధాన పత్రిక దిల్ రాజు పెళ్లయ్యిందంటూ ఓ కథనం వండింది. దాంతో చిత్రసీమ షాక్ కి గురైంది. ఇంత రహస్యంగా దిల్ రాజు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముందంటూ ఆశ్చర్యపోయింది. నిజానికి దిల్ రాజు పెళ్లి ఇంకా జరగలేదు. అదో కట్టు కథ మాత్రమే. ఈ పెళ్లి విషయంలో దిల్రాజు ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదట. అయినా సరే. పెళ్లయిపోయిందంటూ వార్తలు రావడం దిల్ రాజుని బాగా ఇబ్బంది పెట్టిందని, ఈ విషయంలో ఆయన చాలా సీరియస్గా ఉందని సమాచారం. ప్రింట్ మీడియాలో ఇలాంటి తప్పుడు వార్తలు క్షమార్హం కాదు. ఇలాంటి పెళ్లి వార్తలు ప్రచురించే ముందు జాగ్రత్త వహించాల్సిందే.