ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు తాను మళ్ళీ పెళ్ళి చేసుకోనున్నట్లు నిన్ననే అధికారికంగా ప్రకటించిన విషయం విదితమే. నిన్న రాత్రి దిల్ రాజు వివాహం జరిగింది. ఈ వేడుకకు దిల్ రాజు కుమార్తె పెళ్ళి పెద్దగా మారడం గమనార్హం. మూడేళ్ళ క్రితం దిల్ రాజు మొదటి భార్య అనారోగ్యంతో కన్ను మూశారు. భార్య మరణంతో కుంగిపోయిన దిల్ రాజు, తిరిగి మామూలు మనిషిలా మారడానికి చాలా సమయమే పట్టింది. సినిమా నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ తదితర వ్యాపకాల్లో మునిగిపోయినా, దిల్ రాజు జీవితంలో భార్య లేని లోటు అలాగే వుండిపోయింది. ఈ నేపథ్యంలో, కుటుంబ సభ్యులు రెండో పెళ్ళి విషయమై దిల్ రాజుపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది.
ప్రధానంగా దిల్ రాజు కుమార్తె, తన తండ్రికి మళ్ళీ పెళ్ళి చేయాలని సంకల్పించుకున్నారు. ఈ నేపథ్యంలోనే, దిల్ రాజు, కుమార్తె సూచన మేరకు రెండో పెళ్ళికి సిద్ధమయ్యారు. తన ఇష్ట దైవం వెంకటేశ్వరస్వామి సన్నిధిలో, నిజామాబాద్లో నిరాడంబరంగా దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్నారు. కొత్త జీవితాన్ని ప్రారంభించిన దిల్ రాజుకి సినీ ప్రముఖులు విషెస్ అందించారు. ‘దిల్’ రాజు వివాహానికి సంబంధించిన కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి.