పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని భాషల నటీ నటులు, టెక్నీషన్స్ కలిసి వర్క్ చేస్తున్నారు. దర్శకులు కూడా అందరి హీరోలని దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకుంటు న్నారు. బాలీవుడ్ లో ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్ కోసం కథలు సిద్ధం చేస్తుంటే బాలీవుడ్ హీరోల కోసం సౌత్ డైరక్టర్స్ కథలు వండుతున్నారు. ఇప్పటికే సందీప్ వంగా, అట్లీ, మురుగుదాస్ లాంటి స్టార్ దర్శకులు బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసి సక్సెస్ అవుతుంటే మరికొందరు కూడా ఈ బాటలో నడుస్తున్నారు.
దంగల్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అమీర్ ఖాన్, లాల్ సింగ్ చద్దా మూవీ డిజాస్టర్ కావటంతో కొన్నాళ్లుగా సినిమాలకి బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు ఒక తెలుగు దర్శకుడు అమీర్ ఖాన్ కోసం కథ రాసి, ఆయన్ని ఒప్పించే పనిలో ఉన్నాడు. అతను ఎవరో కాదు కుటుంబ కథా చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి. ఎన్టీఆర్ తో బృందావనం, చరణ్ తో ఎవడు, నాగార్జునతో ఊపిరి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో వారసుడు తీసి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న క్రేజీ డైరక్టర్ వంశీ పైడిపల్లి. వంశీ కథకి నో చెప్పే వారుండరు. పైగా అమీర్ కి కూడా ఇది మంచి కమ్ బ్యాక్ అవుతుందని, కచ్చితంగా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కు తోంది అని ఫిలిం నగర్ టాక్.
సౌత్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మూవీని తెరకెక్కించేందుకు రెడీ గా ఉన్నారని, ఓ మంచి పవర్ ఫుల్ ప్రాజెక్ట్ తో దిల్ రాజు బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం అయ్యారని సమాచారం. వంశీ, అమీర్ ఖాన్, దిల్ రాజు కాంబో మూవీ నేరుగా తెలుగులో చేస్తూ అన్ని భాషల్లో రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. భారీ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది అని, ఈ చిత్రానికి దాదాపు 300కోట్ల బడ్జెట్ రాజుగారు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.