నిర్మాతగానే కాదు, పంపిణీ రంగంలోనూ దిల్ రాజుది తిరుగులేని స్థానం. నైజాంలో ఓ సినిమా విడుదల కావాలంటే.. దిల్ రాజు అండదండలు ఉండాల్సిందే. పెద్ద సినిమా అయితే... అది దిల్ రాజు చేతికి వెళ్లాల్సిందే. కొన్నాళ్లుగా నైజాంలో తనే రారాజు. అయితే ఆమధ్య ఈ లెక్క కొంత మారింది. పంపిణీ రంగంలో కొత్త కొత్త పేర్లు వినిపించడం మొదలైంది. వరంగల్ శ్రీను... ఈమధ్య నైజంలో పెద్ద సినిమాలకు కేరాఫ్ గా నిలిచారు. ఆమద్య హిట్టయిన పెద్ద సినిమాలన్నీ వరంగల్ శ్రీను రిలీజ్ చేసినవే. దాంతో... నైజాంలో ఆధిపత్య పోరు మొదలైందని, దిల్ రాజు వెనక బడ్డారని ప్రచారం జరిగింది.
అయితే ఇప్పుడు దిల్ రాజు మళ్లీ పుంజుకున్నారు. వరుసగా పెద్ద సినిమాలన్నీ కొనేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ నైజాం హక్కుల్ని దిల్ రాజు రూ.70 కోట్లకు సొంతం చేసుకున్నారని టాక్. రాధే శ్యామ్, భీమ్లా నాయక్, అఖండ సినిమాల నైజాం రైట్స్ కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్టులో పుష్ష కూడా చేరిందని సమాచారం. దాదాపు 40 కోట్లకు ఈ సినిమా నైజాం హక్కుల్ని ఆయన సొంతం చేసుకున్నార్ట. త్వరలో రాబోతున్న పెద్ద సినిమాలన్నీ ఇప్పుడు దిల్ రాజు చేతిలో ఉన్నట్టే. అంటే... నైజా పగ్గాలు మళ్లీ ఆయన చేతికి వచ్చేసినట్టే లెక్క.