దిల్ రాజు నెత్తిన పెద్ద పిడుగు పడింది. ఈ పిడుగుకు కారణం.. సాక్షాత్తూ... నిర్మాతల మండలి. వివరాల్లోకి వెళ్తే... ఈ సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలపై నిషేధం విధిస్తూ ఆదివారం ఫిల్మ్ ఛాంబర్ ఓ కీలక నిర్ణయం తీసుకొంది. సంక్రాంతి పెద్ద పండగనీ, ఈ పండక్కి తెలుగు సినిమాలకే ప్రాధాన్యం ఇవ్వాలని అందుకే డబ్బింగ్ సినిమాలకు చెక్ పెడుతున్నామని నిర్మాతల మండలి విడుదల చేసిన ఓ లేఖలో స్పష్టంగా పేర్కొంది. 2019లో సంక్రాంతి సీజన్‌లో డబ్బింగ్ సినిమాలు విరివిగా వచ్చినప్పుడు దిల్ రాజు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. తెలుగు సినిమాలు ఉండగా, డబ్బింగ్ సినిమాలు ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు. ఇప్పుడు అదే నిబంధనని నిర్మాతల మండలి గుర్తు చేసింది. దాంతో దిల్ రాజుకి మింగుడు పడని పరిస్థితి ఏర్పడింది.
ఎందుకంటే ఈ సంక్రాంతికి ఆయన `వారసుడు` సినిమాని విడుదల చేద్దామనుకొన్నారు. విజయ్ కథానాయకుడిగా రూపొందించిన చిత్రమిది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. రష్మిక కథానాయిక. ఇది డబ్బింగ్ సినిమా. తమిళంలో తీసి, తెలుగులో డబ్ చేశారు. కాబట్టి `వారసుడు`ని డబ్బింగ్ సినిమాగానే పరిగణిస్తారు. నిర్మాతల మండలి తాజా నిర్ణయంతో `వారసుడు` విడుదలకు చెక్ పడినట్టే. అయితే దిల్ రాజు తక్కువ వాడేం కాదు. వారసుడు డబ్బింగ్ సినిమా కాదని, ద్వి భాషా చిత్రమని వాదించే అవకాశమూ ఉంది. ఒక వేళ దిల్ రాజ తప్పుకొంటే.. వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలకు కావల్సినన్ని థియేటర్లు దొరుకుతాయి. వారసుడు ఓ వారం ఆగి రావల్సి ఉంటుంది.