చిరంజీవితో సినిమా తీసే అవకాశం రావడం మామూలు విషయం కాదు. ప్రతి దర్శకుడి కల... ఇది. ఈ అవకాశం బాబికి చాలా తొందరగా వచ్చేసింది. వాల్తేరు వీరయ్య సినిమాకి బాబినే దర్శకుడు. ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉంది. జనవరి 13న విడుదల అవుతోంది. ఈ సినిమా విజయంపై బాబి చాలా ధీమాగా ఉన్నాడు. చిరంజీవితో సినిమా చేయడం తన కల అని.. అది వాల్తేరు వీరయ్యతో నెరవేరిందని సంబరపడిపోతున్నాడు బాబి. నిజానికి చిరంజీవికి బాబి అతి పెద్ద అభిమాని. చిరంజీవితో ఫొటో తీయించుకొంటే చాలనుకొనేవాడిని... నేరుగా సినిమానే తీసే ఛాన్స్ రావడం అంటే మాటలు కాదు. చిరుతో ఫొటో విషయంలో కూడా.... బాబికి చాలా జ్ఞాపకాలున్నాయి. వాటిని `వాల్తేరు వీరయ్య` ప్రెస్ మీట్ లో పంచుకొన్నాడు బాబి.
బాబి.. చిన్నప్పుడు చిరంజీవిపై అభిమానంతో, హైదరాబాద్ వచ్చేశాడట. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేస్తే చిరుతో ఫొటో తీయించుకొనే అవకాశం ఉందని తెలిసి.. రక్తదానం చేసి, చిరు ముందు ఫొటో కోసం నిలబడ్డాడట. చిరంజీవి కూడా నవ్వుతూ ఫొటోకి ఫోజు ఇచ్చారు. ఫొటో అయితే వచ్చింది. కానీ.. ఆశ చావదు కదా. అందుకే... రెండోసారి ఫొటో కోసం చిరంజీవి పక్కన మళ్లీ గప్ చుప్‌గా నిలబడ్డాడట. అది గమనించిన చిరంజీవి.. `నువ్వేంటి మళ్లీ వచ్చావ్.. వెళ్లిపో..` అని గట్టిగా అరిచార్ట. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే... చిరంజీవి నవ్వుతూ దిగిన ఫొటో బాబికి దక్కలేదు. అరుస్తున్న ఫొటోవే... ఇచ్చారు. అది చూసి అంతా `చిరంజీవి ఏంటి.. నీ మీద అరుస్తున్నారు ఏం చేశావ్` అని అడగడం మొదలెట్టార్ట. అలా.. చిరంజీవి ఫొటో అనేది ఓ జ్ఞాపకంగా మిగిలిపోయిందని చెప్పుకొచ్చాడు బాబి. ఈ విషయం చెబుతున్నప్పుడు చిరంజీవి వేదికపైనే ఉన్నాడు. బాబి స్పీచు మధ్యలో ఆపి.. తన పక్కకు వచ్చి... `ఇప్పుడు తీయండయ్యా ఫొటోవు` అని ఫొటోగ్రాఫర్ల ముందు ఫోజు ఇచ్చారు. దాంతో కెమెరాలు క్లిక్ మన్నాయి. ఈ సందర్భంగా బాబికి ముద్దు కూడా ఇచ్చాడు చిరు. ఇప్పుడు ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.