‘సినిమాని దియేటర్లలో చూస్తే ఆ కిక్ వేరేలా వుంటుంది. ఆ కిక్ సంగతేంటో ప్రేక్షకులకు బాగా తెలుసు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పై సినిమాల ప్రదర్శనకు నేను వ్యతిరేకం కాదు. అయితే, అది కూడా బుల్లితెర లాంటిదే. వెండితెరకి వుండే ప్రత్యేతే వేరు..’ అంటూ ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తన అభిప్రాయాన్ని కుండబద్దలుగొట్టేశారు. ప్రస్తుతం తన తాజా సినిమా ‘వి’ విడుదల కోసం చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారాయన. ‘కరోనా వైరస్’ ఎఫెక్ట్ లేకపోయి వుంటే, ‘వి’ సినిమా దియేటర్లలోకి వచ్చేసి వుండేదే. నాని, సుధీర్‌బాబు, నివేదా థామస్, అదితిరావు హైదరీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
తమ సినిమా ‘ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ’పై ముందుగానే విడుదల కాబోతోందంటూ ప్రచారం జరుగుతుండడాన్ని ఆయన తప్పుపట్టారు. ఆ అవకాశమే లేదని తేల్చి చెప్పారు. ‘అతి త్వరలో పరిస్థితులు సద్దుమణుగుతాయని ఆశిస్తున్నాం. ఆ తర్వాత ప్రేక్షకులు ఖచ్చితంగా దియేటర్లకు వస్తారు. సినిమాపై వారికున్న అభిమానం అంతా ఇంతా కాదు..’ అని ఇంద్రగంటి మోహనకృష్ణ అభిప్రాయపడ్డారు. ‘సమ్మోహనం’ తరహాలో ఓ ఇంట్రెస్టింగ్ మూవీ త్వరలోనే తెరకెక్కించబోతున్నారట. అలాగే ఓ పెద్ద సినిమాని కూడా ఆయన ప్లాన్ చేస్తున్నారట. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటోన్న ఇంద్రగంటి మోహనకృష్ణకు మనమూ శుభాకాంక్షలు చెప్పేద్దాం.