ప్రపంచాన్ని కుదిపేస్తోన్న కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించేందుకు సినీ పరిశ్రమ తనవంతుగా ప్రయత్నిస్తోంది. సంగీత దర్శకులు తమ టాలెంట్‌ని, కరోనా వైరస్ మీద పాటలు చేయడం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచడం కోసం ఉపయోగిస్తున్నారు. సీనియర్ సంగీత దర్శకుడు కోటి నుంచి అప్‌కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ వరకూ తమకు తోచిన విధంగ పాటలు రూపొందిస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో సంగీత దర్శకుడు రఘు కుంచె ఈ మధ్యనే ఓ పాటను విడుదల చేశారు. కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా వ్యవహరించకపోతే ఏం జరుగుతుందో కాస్త ‘నాటుగా’ వాయించి పారేశాడు రఘు కుంచె. ఈసారి ఇంకో సాంగ్ రఘు కుంచె నుంచి వచ్చింది. అయితే, కొత్త సాంగ్‌ని చాలా ‘హార్ట్ టచ్చింగ్’గా రూపొందించారాయన.
‘సలాం పోలీస్ అన్నా..’ అంటూ సాగే ఈ పాటలో, జనం కోసం నిద్రాహారాలు మానేసి కష్టపడుతున్న పోలీసుల వెతల్ని కళ్ళకు కట్టేలా చూపించారు రఘు కుంచే, ఆయన టీవ్‌ు. ప్రతి అక్షరం ప్రస్తుతం పోలీసులు మన కోసం పడుతున్న కష్టాన్ని గుర్తు చేస్తోంది. ఈ తరహా పాటల రూపకల్పన ఇప్పుడెంతో అవసరం. ఎందుకంటే, మాటకంటే పాటకి వుండే రీచ్ చాలా చాలా ఎక్కువ. ఆ పాట చాలా మందిని ప్రభావితం చేస్తుంది. రఘు కుంచే నుంచి జాలువారుతున్న పాటల ప్రవాహం ఇంకా ఇంకా కొనసాగేలానే వుంది.. కరోనా వైరస్‌కి సంబంధించి.