ఓ కుర్రాడు సినీ దర్శకుడిగా పరిచయం అవుతూనే, ప్రముఖ దర్శకుల ప్రశంసలు అందుకోవడమంటే చిన్న విషయం కాదు. ఏదో మ్యాజిక్ వుంది ఆ కుర్రాడిలో. 'ఘాజీ' సినిమా రూపొందుతున్నప్పుడు ఆ సినిమానే ఎవరూ పట్టించుకోలేదు. కానీ, విడుదలయ్యేసరికి అంతా షాక్ అయ్యారు. సంకల్ప్ రెడ్డి 'సంకల్పం' ఏ స్థాయిలో వుంటుందో 'ఘాజీ' చూస్తే అర్థమవుతుంది. హైద్రాబాద్‌లో ఓ సెట్ వేసేసి, దాన్నే రియల్ సబ్‌మెరైన్ అన్పించేసి, సముద్రం అడుగున విహరింపజేసేశాడు ప్రేక్షకుల్ని.
ఆ దర్శకుడే ఇప్పుడు మనల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్ళిపోతున్నాడు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అదితి రావు హైదరీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న 'అంతరిక్షం' లేటెస్ట్ ప్రోమో, అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. ఆలోచన రావడం కొత్త కాదు, ఆలోచనని అమలు చేసే క్రమంలో సంకల్ప్ రెడ్డి చూపే తెగువకి హేట్సాఫ్ అనాల్సిందే. ప్రోమో చూస్తున్నంతసేపూ, మనం నేల విడిచి.. అంతరిక్షంలోకి వెళ్ళిపోయినట్లే వుంటుందనడం అతిశయోక్తి కాదేమో.
అతి తక్కువ బడ్జెట్‌లో 'ఘాజీ'తో అద్భుతాలు సృష్టించిన సంకల్ప్ రెడ్డి, ఈసారి ఓ మోస్తరు బడ్జెట్‌తోనే 'అంతరిక్షం' సినిమాని రూపొందించాడట. అంతరిక్షం నేపథ్యంలో సినిమాలు హాలీవుడ్‌లోనే చూస్తుంటాం. వందల కోట్లు కుమ్మరించి తీస్తుంటారు ఆ సినిమాల్ని. ఆ స్థాయి విజువల్స్ మన తెలుగు సినిమాలో, అదీ 'అంతరిక్షం'లో చూడబోతున్నాం. ఇది మాత్రం నిజం.. అన్పించేలా వుంది ప్రోమో.