సత్యం సినిమాతో పాపులర్ అయ్యాడు సూర్య కిరణ్. ఆసినిమా ఎంత పెద్ద హిట్టంటే, ఈ సినిమాతో సూర్య కిరణ్ పేరు మార్మోగిపోయింది. ఆ తరవాత.. అంతే సడన్ గా మాయమైపోయాడు. కథానాయిక కల్యాణీని పెళ్లి చేసుకోవడం, ఇద్దరూ విడిపోవడం కూడా జరిగిపోయాయి. మళ్లీ.. ఇన్నాళ్లకు బిగ్ బాస్ లో కనిపించాడు. ఇక్కడా దురదృష్టం వెన్నాడింది. తొలి వారానికి ఎలిమినేట్ అయిపోయి, బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోయాడు. కాకపోతే.. సూర్య కిరణ్ ని మళ్లీ మీడియా ముందుకు తీసుకొచ్చింది బిగ్ బాస్. తన జీవితంలో ఏం జరిగింది? కల్యాణీతో ఎందుకు విడాకులు తీసుకోవాల్సివచ్చింది? అనే విషయాలు కొత్తగా వెలుగులోకి వచ్చాయి.
కల్యాణిపై తన ప్రేమని మరోసారి బయటపెట్టాడు సూర్య కిరణ్. ''తనంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ తనని ప్రేమిస్తూనే ఉన్నా. అందుకే తన ఫొటోని ఇప్పటికీ నా ఫోన్ వాల్ పేపర్ గా పెట్టుకున్నా. తనకు నేనంటేనే ఇష్టం లేదు. అందుకే విడిచి వెళ్లిపోయింది. తను గుర్తొస్తే నాకు కన్నీళ్లు ఆగవు'' అని ఆవేదన వెళ్లగక్కాడు. జీవితంలో కొంతమందిని నమ్మి మోసపోయానని, సినిమాల వల్ల పది కోట్లు నష్టపోయాయని, అలా నష్టపోవడం వల్లే తన జీవితం తారుమారు అయ్యిందని బాధపడుతున్నాడు. అయితే తన టాలెంట్ నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటానంటున్నాడు. బిగ్ బాస్ ఇచ్చిన స్ఫూర్తితోనో, గతం ఇచ్చిన అనుభవాల పాఠాలతోనో.. సూర్య కిరణ్ మరో ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడేమో చూడాలి.