అమేజాన్, హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్.. ప్రస్తుతం వినోద రంగం మొత్తం ఇలాంటి ఓటీటీ వేదికల చుట్టూనే తిరుగుతోంది. థియేటర్లకు తాళాలు పడడం, షూటింగులు ఆగిపోవడంతో వెబ్ సిరీస్‌లో ఉన్న కంటెంటే.. ఇప్పుడు వినోద సాధనంగా మారిపోయింది. ఓటీటీ సంస్థలు కూడా కంటెంట్ పెంచుకునే విషయంపై దృష్టి పెట్టాయి. అందుకోసం భారీ ప్లానింగులు వేస్తున్నాయి. తాజాగా అమేజాన్ సంస్థ ప్రముఖ దర్శకుడు తేజతో ఓ భారీ డీల్ కుదుర్చుకున్నట్టు టాక్. మూడు వెబ్ సిరీస్‌లతో పాటు, ఓ సినిమా తెరకెక్కించడానికి తేజ - అమేజాన్ మధ్య డీల్ కుదిరిందని ఇండ్రస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఓ వెబ్ సిరీస్‌కి తేజ దర్శకత్వం వహిస్తారు. మరో వెబ్ సిరీస్‌కి కథ అందిస్తారు.
మరో వెబ్ సిరీస్‌ని తేజ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తారు. అమేజాన్ తెలుగు సినిమా నిర్మాణ రంగంలో అడుగుపెట్టబోతోంది. అందులో భాగంగా తేజతో ఓ సినిమా ప్లాన్ చేస్తోంది. అయితే ప్రస్తుతం ఈ చర్చలన్నీ ప్రాధమిక దశలోనే ఉన్నట్టు టాక్. ఎలాంటి కథలు చేయాలి? ఎలాంటి సినిమాలు రూపొందించాలి? అనే విషయంపై ఇంకా ఓ క్లారిటీకి రాలేదు. బహుశా లక్ డౌన్ తరవాత.. ఓ స్పష్టత వస్తుందేమో చూడాలి.