ఒకప్పుడు వినాయక్.. ఓ స్టార్ డైరెక్టర్. ఒకప్పుడేంటి? ఆ మాటకొస్తే ఇప్పటికీ వినాయక్ స్టార్ డైరెక్టరే. కాకపోతే హీరోలు, నిర్మాతలు వినాయక్ ని పట్టించుకోవడం మానేశారు. వినాయక్ కూడా పూర్తిగా రిలాక్స్ అయిపోయినట్టు కనిపిస్తోంది. హీరోల కోసం పరుగులు తీయడం పక్కన పెట్టేశాడు. `ఖైది నెం 150` లాంటి హిట్టు ఇచ్చిన తరవాత కూడా వినాయక్ హీరోని ఒప్పించడంలో విఫలం అవుతున్నాడంటే - పరిస్థితిని అర్థం చేసుకోవొచ్చు. సడన్‌గా వినాయక్‌లోని `హీరో` బయటకు వస్తున్నాడిప్పుడు. వినాయక్ హీరోగా దిల్‌రాజు ఓ సినిమా తీయడానికి రంగం సిద్దం చేస్తున్నాడు.
వినాయక్‌లో హీరో క్వాలిటీస్ దిల్‌రాజుకి ఎలా కనిపించాయన్నది ఆశ్చర్యకరమైన ప్రశ్నే. కాకపోతే.. ఈ సినిమాలో హీరోయిజం ఉండదు. కథని డ్రైవ్ చేసే పాత్రలో వినాయక్ కనిపిస్తాడంతే. పైగా ఇదో రివేంజ్ డ్రామా అని తెలుస్తోంది. తమిళంలో ఇలాంటి పాత్రలెక్కువగా సముద్రఖని చేస్తుంటాడు. తను ఓ దర్శకుడు కూడా. కానీ మెల్లమెల్లగా నటుడిగా మారిపోయాడు. ఇప్పుడు నటుడిగానే సముద్రఖని అందరికీ తెలుసు. వినాయక్ కూడా.. సముద్రఖనిలా మారిపోతాడేమో చూడాలి.